Undavalli Sridevi: దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి: ఉండవల్లి శ్రీదేవి

Amaravati Undavalli Sridevis Vision for a World Class Capital
  • చంద్రబాబు, పవన్ కృషితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమన్న శ్రీదేవి
  • అమరావతి 2.0 కింద 17 కీలక ప్రాజెక్టు సాకారమవుతున్నాయని వెల్లడి
  • జగన్ పాలనలో అమరావతి విధ్వంసం, దోపిడీ జరిగిందని ఆరోపణ
ఏపీ రాజధాని అమరావతి దేశంలోనే అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని, ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మాణానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ రూ.49 వేల కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునఃనిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామమని శ్రీదేవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసికట్టుగా ఈ పనులు పూర్తి చేయాలని ప్రధాని సూచించారని గుర్తుచేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషి కూడా అమరావతి నిర్మాణంలో కీలకమని ప్రశంసించారు.

గత వైసీపీ ప్రభుత్వంపై శ్రీదేవి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "జగన్మోహన్ రెడ్డి తన పాలనలో అమరావతిని ధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. 'మాట తప్పను, మడమ తిప్పను' అని చెప్పి అమరావతి విషయంలో మాట మార్చారు" అని ఆరోపించారు. మద్యం కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని, రుషికొండపై అనవసర వ్యయం చేశారని ధ్వజమెత్తారు. దళిత రాజధానిగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

"అమరావతి 2.0 కింద 17 కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయి. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేయడంతో పాటు, నూతన ఐకానిక్ భవనాలను నిర్మిస్తాం" అని శ్రీదేవి వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, హ్యాపీనెస్ట్ వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు. అమరావతిలో అందుబాటులో ఉన్న రెండు లక్షల కోట్ల విలువైన మిగులు భూమి ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తుందని శ్రీదేవి విశ్వాసం వ్యక్తం చేశారు.

"చంద్రబాబు రాత్రింబవళ్లు రాజధాని కోసం శ్రమిస్తున్నారు. బహుశ ఆయన పడుకునేది రోజుకి 4 గంటలు మాత్రమే. ఈ వయసులో కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. అందరూ అలా కష్టపడలేరు. ఆయన ఒక విజనరీ లీడర్. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు అమరావతి రాజధాని నిర్మాణానికి అందరూ కలసి మెలసి భుజం భుజం కలిపి ముందుకెళ్లాలి. సౌత్ ఇండియాలో బెస్ట్ క్యాపిటల్ గా మారాలి. అమరావతి మహిళా రైతుల కృషి కూడా మరువలేనిది. వైసీపీ హయాంలో ప్రజలకు చెందాల్సిన వాటి గురించి ప్రజా ప్రతినిధిగా వెళ్లి అడిగితే విలువ లేకుండా పోయేది. కాని నేడు ఆ పరిస్థితులు లేవు. అడిగకముందే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి" అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.
Undavalli Sridevi
Amaravati
Andhra Pradesh Capital
Chandrababu Naidu
Nara Lokesh
Amaravati Redevelopment
AP Capital
Jagan Mohan Reddy
YSRCP
TDP

More Telugu News