KTR: కేసీఆర్‌ను అంటే నీ నాలుక చీరేసే రోజు వస్తుంది: రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక

KTR Warns Revanth Reddy Your Tongue Will Be Slit
  • రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు
  • బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం
  • రేవంత్ రెడ్డికి చేతకాకుంటే అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. "ముఖ్యమంత్రిగారికి చివరిసారి చెబుతున్నాం. కేసీఆర్‌ను ఇప్పటి వరకు ఎన్ని మాటలన్నా పడ్డాం. ఇక నుంచి కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలుక చీరేసే రోజు వస్తుంది. తప్పకుండా గుర్తు పెట్టుకో. ముమ్మాటికి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టే నాయకుడు కేసీఆర్ మాత్రమే" అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డికి చేతకాకుంటే అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్, ఢిల్లీ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు పదేపదే చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన ఈ హెచ్చరికలు నేడు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిపాలన బాధ్యతలు నిర్వర్తించడం చేతకాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తున్నారని, ఆయన కాడి కిందపడేశారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని కూడా కేటీఆర్ హెచ్చరించారు. "నిన్నటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని సీఎంగా స్పష్టమైంది" అని కేటీఆర్ అన్నారు. గత ఏడాదిన్నర కాలంగా తమను, తమ నాయకుడిని వ్యక్తిగతంగా ఎంత దూషించినా సహించామని కేటీఆర్ అన్నారు. అయితే, వేలాది మంది త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగా, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, చివరకు కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆవేదన కలిగించాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కచ్చితంగా స్పందించాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు.

మూడేళ్ల క్రితం వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలకు పెంపు, కౌలు రైతులకు రైతుబంధు వంటి హామీలిచ్చారని, వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కూడా ఊహించలేదని, అందుకే అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చలేక, ఏం చేయాలో తెలియక ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.
KTR
Revanth Reddy
KCR
Telangana Politics
BRS
Congress
Telangana Chief Minister
Political War
India Politics
Election Warnings

More Telugu News