Janajagaran Samithi: విశాఖలో కరాచీ బేకరి పేరును వెంటనే మార్చాలి... జనజాగరణ సమితి డిమాండ్

Visakhapatnam Karachi Bakery Name Change Demand
  • విశాఖలో కరాచీ బేకరి పేరుపై వివాదం
  • వెంకోజిపాలెంలో జనజాగరణ సమితి నిరసన
  • పాకిస్థాన్ నగరమైన కరాచీ పేరుపై అభ్యంతరం
  • తక్షణమే పేరు మార్చాలని, లేదంటే దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో... విశాఖపట్నం నగరంలోని వెంకోజిపాలెంలో ఉన్న 'కరాచీ బేకరి' పేరు వివాదాస్పదంగా మారింది. ఈ బేకరి పేరును తక్షణమే మార్చాలంటూ జనజాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పాకిస్థాన్‌కు చెందిన నగరం పేరును భారతదేశంలో ఒక వ్యాపార సంస్థకు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

విశాఖపట్నంలోని డైమండ్ పార్క్ రోడ్డులో ఉన్న కరాచీ బేకరి ఎదుట జనజాగరణ సమితి సభ్యులు నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్‌లోని ప్రధాన నగరమైన 'కరాచీ' పేరును బేకరికి పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని సమితి ప్రతినిధులు ఆగ్రహం వెలిబుచ్చారు. బేకరి యాజమాన్యం వెంటనే స్పందించి పేరును మార్చాలని వారు కోరారు.

తమ డిమాండ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించిన జనజాగరణ సమితి ప్రతినిధులు, యాజమాన్యం దిగిరాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. బేకరి పేరును తక్షణమే మార్చని పక్షంలో, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సదరు బేకరి యాజమాన్యంపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
Janajagaran Samithi
Karachi Bakery
Visakhapatnam
Pakistan
Bakery Name Change Protest
India
Nationalist Sentiment
Visakhapatnam Protest
Anti-Pakistan Sentiment
Diamond Park Road

More Telugu News