Crime News: నా కూతురిని చంపించి, నీ కూతురి పెళ్లి చేసుకుంటున్నావా?"... అంటూ దారుణ హత్య

Karnataka To avenge daughters murder man kills jilted lovers father
  • కూతురి హత్యకు ప్రతీకారంగా నిందితుడి తండ్రి హత్య
  • నిందితుడు వెంకటేష్ పరారీ
  • జనవరిలో వెంకటేష్ కుమార్తె దీపిక దారుణ హత్య
  • కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘటన
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘటనలో, కన్నకూతురి హత్యకు ప్రతీకారంగా ఓ వ్యక్తి, నిందితుడి తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. "నా కూతురిని చంపించి, ఇప్పుడు నీ కూతురి పెళ్లి వేడుకలు చేసుకుంటున్నావా?" అని అరుస్తూ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన మంగళవారం పాండవపుర సమీపంలోని మణిక్యానహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, మణిక్యానహళ్లి గ్రామానికి చెందిన నరసింహ గౌడ అనే వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ మంగళవారం దారుణంగా హత్య చేశాడు. నరసింహ గౌడ గ్రామానికి సమీపంలోని ఓ టీ దుకాణం వద్ద కూర్చుని ఉండగా, వెంకటేశ్ అతడిని అనుసరించి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు వెంకటేశ్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.

ఈ హత్య వెనుక ప్రతీకారేచ్ఛ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడు వెంకటేశ్ కుమార్తె దీపిక (28), ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. ఆమెను ఈ ఏడాది జనవరి 19న నరసింహ గౌడ కుమారుడైన నితేష్ గౌడ (21) దారుణంగా హత్య చేశాడు. దీపిక గతంలో నితేష్‌తో ప్రేమాయణం సాగించిందని, ఆ తర్వాత అతడిని దూరం పెట్టిందని సమాచారం. ఈ క్రమంలో, తన పుట్టినరోజు వేడుకల నెపంతో దీపికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నితేష్, ఆమె ముఖంపై రాయితో మోది, హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివాహిత అయిన దీపికకు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

కూతురు హత్యకు గురైన నాటి నుంచి వెంకటేశ్ ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, తొలుత నితేష్‌ను హత్య చేయాలని వెంకటేశ్ ప్లాన్ చేసినప్పటికీ, అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో, నితేష్ సోదరి వివాహం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలంలో జరగాల్సి ఉండటం వెంకటేష్ ఆగ్రహాన్ని మరింతగా ప్రజ్వరిల్లేలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నరసింహ గౌడను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై మేలుకోట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనతో మణిక్యానహళ్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Crime News
Venkatesh
Narasimhe Gowda
Mandya District
Karnataka
Murder
Revenge Killing
Deepa
Nitesh Gowda
Crime News
India

More Telugu News