Smita Sabarwal: స్మితా సబర్వాల్ అంశంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Shridhar Babu Responds to Smita Sabarwal Issue
  • స్మితా సబర్వాల్‌పై తమ ప్రభుత్వానికి కక్ష లేదన్న మంత్రి
  • ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆవేదనగా చూడాలన్న శ్రీధర్ బాబు
  • పహల్గామ్ ఘటనకు బాధ్యత వహించి బీజేపీ నాయకులు పదవులు వీడాలన్న మంత్రి
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. "అధికారులు ఎవరైనా కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. స్మితా సబర్వాల్‌‌పై మాకు ఎలాంటి కక్ష లేదు" అని ఆయన స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో అందాల పోటీల నిర్వహణను ఉద్యోగుల సమస్యలతో ముడిపెట్టడం సరికాదన్నారు. "అందాల పోటీలు కేవలం సౌందర్యానికి సంబంధించినవి కావు. అవి వ్యక్తిత్వానికి సంబంధించినవి. తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేయడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నాం" అని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే ఆమె మాట్లాడుతున్నారని అన్నారు. "కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయడం లేదంటే ఎవరు నమ్ముతారు? బీఆర్ఎస్ నేతలు ఎప్పటికీ మాకు రాజకీయ ప్రత్యర్థులే" అని పేర్కొన్నారు. 

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పెంచిందని, రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉందో లేదో ప్రజలకు తెలుసని అన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందన

ఉద్యోగ సంఘాల వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం, వాటిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. తమ ముఖ్యమంత్రి ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఆయన వ్యాఖ్యలను ఆవేదనగా మాత్రమే పరిగణించాలని సూచించారు. ఉద్యోగుల డిమాండ్లను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని, హామీలు ఇచ్చే సమయంలోనే అన్ని అంచనాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన భరోసా ఇచ్చారు.

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ నేతలు తమ పదవుల నుంచి తప్పుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. కానీ వారే తమను పదవి నుంచి దిగిపోవాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు హెలికాప్టర్ వినియోగించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిందని, సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, అవసరమైనప్పుడు వినియోగించడంలో తప్పులేదని అన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చులు చేసిందని ఆరోపించారు.
Smita Sabarwal
Shridhar Babu
Telangana Politics
IAS Officer
KCR
Revanth Reddy
Congress
BRS
Telangana Government
Land Scam

More Telugu News