Mumbai Indians: పరుగుల కోసం చెమటోడ్చిన ముంబయి ఇండియన్స్... గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యం

Mumbai Indians Struggle Against Gujarat Titans Set a Moderate Target
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
  • ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు
  • రాణించిన విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35)
  • సాయి కిశోర్ కు రెండు వికెట్లు
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై జట్టులో విల్ జాక్స్ అర్ధశతకంతో (53 పరుగులు, 35 బంతుల్లో; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకోగా, సూర్యకుమార్ యాదవ్ (35 పరుగులు, 24 బంతుల్లో; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (2) పరుగులకే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (7) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అర్షద్ ఖాన్ వేసిన బంతికి ప్రసిధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ఈ దశలో విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. అయితే, మంచి ఊపుమీదున్న సూర్యకుమార్ యాదవ్‌ను సాయి కిశోర్ పెవిలియన్ పంపగా, ఆ వెంటనే విల్ జాక్స్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో ముంబై భారీ స్కోరు ఆశలకు గండిపడింది.

ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1), నమన్ ధిర్ (7) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో కార్బిన్ బాష్ (27 పరుగులు, 22 బంతుల్లో; 1 ఫోర్, 2 సిక్సర్లు) కొన్ని మెరుపు షాట్లు ఆడి జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి అతను రనౌట్ అయ్యాడు. 

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ 2 వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ తలో వికెట్ దక్కించుకున్నారు. రషీద్ ఖాన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది.
Mumbai Indians
Gujarat Titans
Will Jacks
Suryakumar Yadav
IPL 2023
Cricket Match
Tilak Varma
Hardik Pandya
Mohammad Siraj
Rashid Khan

More Telugu News