Indian Air Force: పాకిస్థాన్ సరిహద్దుల్లో రేపు భారత వాయుసేన 'వార్ గేమ్స్'

Indian Air Force to Conduct Major Drills Near Pakistan Border
  • రాజస్థాన్ భూభాగంలో భారీస్థాయి యుద్ధ విన్యాసాలకు సర్వం సిద్ధం
  • రఫేల్, సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో కసరత్తు
  • విన్యాసాల వేళ సరిహద్దు విమానాశ్రయాల నుంచి రాకపోకలు బంద్
  • దేశవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో పౌర రక్షణ మాక్‌ డ్రిల్స్‌
భారత వాయుసేన వార్ గేమ్స్ చేపడుతోంది. పాకిస్థాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్ భూభాగంలో భారీస్థాయి యుద్ధ విన్యాసాలు నిర్వహించడానికి సిద్ధమైంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా పౌరుల భద్రత, సంక్షోభ సమయాల్లో అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మాక్‌ డ్రిల్స్‌ కూడా జరుగుతున్నాయి.

వాయుసేన వర్గాల సమాచారం ప్రకారం ఈ విన్యాసాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు ఐదున్నర గంటల పాటు నిర్విరామంగా సాగే ఈ కసరత్తులో రఫేల్‌, సుఖోయ్‌-30, మిరాజ్‌ 2000 వంటి అత్యాధునిక, శక్తివంతమైన యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలకు సంబంధించి పైలట్లకు ముందస్తు సమాచారాన్ని (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ - NOTAM) వాయుసేన ఇప్పటికే జారీ చేసింది. ఈ విన్యాసాల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లోని విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. వైమానిక దాడులు, బాంబు దాడులు వంటి అత్యవసర, సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎలా స్పందించాలి, తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్స్‌ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ మాక్‌ డ్రిల్స్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు.
Indian Air Force
Pakistan Border
Military Exercises
Rafale
Sukhoi-30
Mirage 2000
Civil Defence Drills
National Security
Rajasthan
India-Pakistan tensions

More Telugu News