Gautam Gambhir: కామెంటేటర్లుగా మారిన మాజీ క్రికెటర్లపై గంభీర్ ఫైర్

Gautam Gambhir Fires Back at Critics
  • కోచింగ్‌పై విమర్శలకు గౌతమ్ గంభీర్ ఘాటు స్పందన
  • దేశం గర్వపడేలా చేయడమే తన లక్ష్యం, కామెంటేటర్లను మెప్పించడం కాదని స్పష్టీకరణ
  • కొందరు మాజీ ఆటగాళ్లు భారత క్రికెట్‌ను తమ కుటుంబ జాగీరుగా భావిస్తున్నారని విమర్శ
  • పన్ను ఆదా కోసం ఎన్నారైలుగా మారేవారిపై పరోక్ష విమర్శలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తన కోచింగ్ విధానంపై వస్తున్న విమర్శల పట్ల తీవ్రంగా స్పందించాడు. కొందరు కామెంటేటర్లు, మాజీ ఆటగాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశం గర్వపడేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమని, ఎవరినో సంతోషపెట్టడానికి తాను ఇక్కడ లేనని స్పష్టం చేశాడు.

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా తన దార్శనికత, కోచింగ్ ఆరంభ రోజుల గురించి గంభీర్ మాట్లాడుతూ, "నేను ఈ ఉద్యోగం చేపట్టినప్పుడే, ఇందులో ఎత్తుపల్లాలు ఉంటాయని నాకు తెలుసు. దేశం గర్వపడేలా చేయడమే నా పని. ఏసీ కామెంటరీ బాక్సుల్లో కూర్చునే కొద్దిమంది వ్యక్తులను సంతోషపెట్టడం కాదు" అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

కొందరు మాజీ ఆటగాళ్లు భారత క్రికెట్‌ను తమ వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తున్నారని గంభీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "25 ఏళ్లుగా కామెంటరీ బాక్సుల్లో కూర్చుంటున్న కొందరు వ్యక్తులు భారత క్రికెట్ తమ కుటుంబ జాగీరని అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇది భారత ప్రజలకు చెందినది" అని పేర్కొన్నాడు.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ మాజీ ఓపెనర్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ విషయంలో తనపై గతంలో వచ్చిన విమర్శలను కూడా ప్రస్తావించాడు. "వారు నా ప్రైజ్ మనీని కూడా ప్రశ్నించారు. వీళ్లు  భారతదేశం నుంచి డబ్బు సంపాదించి, పన్ను ఆదా చేసుకోవడానికి ఎన్నారైలుగా మారతారు" అని చురకలంటించాడు. నేను మాత్రం భారతదేశంలోనే ఉండి, ఇక్కడే నా పన్నులు చెల్లిస్తాను అని స్పష్టం చేశాడు.

"నేను ఏ రిక్రియేషన్ క్లబ్ లేదా లాబీకి చెందిన కోచ్‌ను కాను. రాజకీయాలు చేయడంలో నాకు నమ్మకం లేదు. నిర్భయంగా, దేశ గౌరవం కోసం ఆడే జట్టును నిర్మించడానికి నేను ఇక్కడ ఉన్నాను" అని గంభీర్ పేర్కొన్నాడు.


Gautam Gambhir
Team India Head Coach
Cricket Commentary
Former Cricketers
India Cricket Team
Controversial Remarks
BCCI
T20 World Cup
ODI World Cup
Prize Money

More Telugu News