Andhra Pradesh Government: రూ.1కే యూనిట్‌ విద్యుత్ సరఫరా.. నూతన ఎలక్ట్రానిక్స్ విధానం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Launches New Electronics Policy with Re 1 Electricity
  • ఏపీ నూతన ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల
  • ఎలక్ట్రానిక్స్ తయారీకి ఏపీ భారీ ప్రోత్సాహం
  • రూ.4.2 లక్షల కోట్ల ఉత్పత్తి, 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా రూ.4.2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రాష్ట్రంలో తయారు చేయాలని, అలాగే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ నూతన విధానం కింద, ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకు పెట్టుబడుల ఆధారంగా, కేటగిరీల వారీగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి యూనిట్లకు 100 శాతం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, పరిశ్రమలో నియమితులయ్యే ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు ఐదేళ్ల పాటు ప్రోత్సాహకంగా అందించనున్నారు. పారిశ్రామిక ప్రగతికి అత్యంత కీలకమైన విద్యుత్‌ను కూడా రాయితీపై అందించాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌ను కేవలం రూపాయికే సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన వాతావరణం ఉందని ప్రభుత్వం వివరించింది. విశాఖపట్నం, తిరుపతి, శ్రీసిటీ, నెల్లూరు, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఉన్నాయని గుర్తు చేసింది. నైపుణ్యం కలిగిన యువత, ప్రభుత్వ అనుకూల విధానాలు, మెరుగైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ వంటివి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఈ సమగ్రమైన ప్రోత్సాహకాలతో కూడిన నూతన పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Andhra Pradesh Government
Electronics Manufacturing Policy
AP Electronics Policy
India Electronics Industry
Investment Incentives
Electronics Clusters Andhra Pradesh
AP Industrial Policy
Electronics
Subsidized Electricity

More Telugu News