Jagga Reddy: మెదక్ నుంచి రఘునందన్ రావు అందువల్లే గెలిచారు: జగ్గారెడ్డి

Jagga Reddy Blames KTR and Raghunandan Rao for BJPs Medak Win
  • ఎవరైనా ముఖ్యమంత్రిని విమర్శిస్తే... తాను ప్రధానమంత్రిని విమర్శిస్తానన్న జగ్గారెడ్డి
  • కేసీఆర్, హరీశ్ రావు మౌనం వల్లే రఘునందన్ రావు గెలిచారని వ్యాఖ్య
  • కేటీఆర్‌వి సినిమా డైలాగులు అని ఎద్దేవా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరువురు నేతలపైనా ఘాటు విమర్శలు చేశారు.

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాజకీయంగా చాలా చిన్న వ్యక్తి అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీశ్ రావు మౌనంగా ఉండటం వల్లే, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలవకూడదనే వారి వ్యూహం కారణంగానే రఘునందన్ రావు మెదక్‌లో ఎంపీగా గెలిచారని అన్నారు. "మీరు మా ముఖ్యమంత్రిని విమర్శించకుంటే, నేను మీ ప్రధానమంత్రిని ఏమీ అనను" అంటూ రఘునందన్ రావుకు ఆయన అల్టీమేటం జారీ చేశారు.

నల్లధనాన్ని ప్రజలకు పంచుతానన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతేమిటని రఘునందన్‌ను ప్రశ్నించారు. ప్రధాని మోదీని 'మోసగాళ్లకు మోసగాడు' అంటే బీజేపీ నేతలు బాధపడరా అని ప్రశ్నించారు. కాబట్టి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని అన్నారు. తాము ప్రధానిని గౌరవిస్తామని, కానీ రఘునందన్ రావు వంటి వారి విమర్శల వల్లే తాము కూడా ప్రతివిమర్శలు చేయాల్సి వస్తోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

"కాంగ్రెస్ వాళ్ల నాలుకలు చీరడం సాధ్యమా? కేటీఆర్ నాలుక కోస్తే ఏమొస్తుంది?" అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ సినిమా స్క్రిప్టులు చదివి డైలాగులు చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వానికి సత్తా లేకుండానే సంవత్సర కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసిందా? అని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. తాము పబ్లిసిటీ చేసుకోవడం లేదని, కానీ ఏడాదిలోనే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని జగ్గారెడ్డి వివరించారు.
Jagga Reddy
Revanth Reddy
KTR
BJP
Congress
BRS
Raghunandan Rao
Medak MP Election
Telangana Politics
Modi

More Telugu News