Chandrababu Naidu: దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Naidus Key Directives in Devastanam Department Review
  • మరో 15 ముఖ్య ఆలయాల్లోనూ భక్తులందరికీ అన్నప్రసాదం అమలు చేయాలన్న సీఎం చంద్రబాబు
  • ముఖ్య ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్దం చేయాలని ఆదేశం
  • మరో 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డితో కలిసి ఆయన ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఏర్పాటు చేస్తున్న బాలాజీ ఆలయ నిర్మాణ నిధి నుంచి సహాయం తీసుకోవాలని సూచించారు.

ప్రధాన, ముఖ్య ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేయాలని, అవి ఆగమశాస్త్రానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరో 15 ముఖ్య ఆలయాల్లో అన్నప్రసాద వితరణను అమలు చేయాలని చెప్పారు. దేవాలయాల భూములు అక్రమణలకు గురి కాకుండా చూడాలని, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని ఆదేశించారు.

ఆలయాల భూములను హోటళ్లకు లీజుకు ఇచ్చే సమయంలో శాకాహారం మాత్రమే ఉండేలా అనుమతులు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు రూ.50 వేలకు పైగా వార్షికాదాయం ఉన్న దేవాలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయని, మరో 24,538 ఆలయాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవాదాయ శాఖలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఆలయాలకు కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి చోట నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Devastanam Department
Temple Development
Tirumala Tirupati Devasthanams
Temple Lands
Annaprasadam
CCTV Cameras

More Telugu News