General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Indian Armys Operation Sindhu Former Army Chiefs Key Remarks
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'
  • సినిమా ఇంకా పూర్తి కాలేదన్న మాజీ ఆర్మీ చీఫ్ నరవణే
  • దాడులు కొనసాగించాలని సూచించిన మాజీ ఆర్మీ చీఫ్ శంకర్ రాయ్‌చౌదరి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, "సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది" అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

దాడులు కొనసాగించాలి

మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులపై స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఇక్కడితో ఆపకూడదని, కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో మాజీ ఆర్మీ చీఫ్‌ల నుంచి ఈ తరహా స్పందన రావడం గమనార్హం.

దాడి దృశ్యాల విడుదల

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు. కోట్లీలోని గుల్పూర్ ఉగ్రవాద శిబిరంపై భారత సైన్యం ఎలా దాడి చేసిందో వివరిస్తూ కల్నల్ సోఫియా ఖురేషి ఒక వీడియోను ప్రదర్శించారు. గతంలో ఫూంచ్‌ సెక్టార్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
General Manoj Mukund Naravane
Operation Sindhu
Indian Army
Pakistan
POK
Terrorist Camps
General Shankar Roychowdhury
Vikram Misri
Colonel Sofia Khureshi
Counter-Terrorism

More Telugu News