Jagan Mohan Reddy: ఉగ్రవాదులను అంతం చేయాల్సిందే... ఉగ్రవాద శిబిరాలపై దాడులు అనివార్యం: జగన్

Jagan Mohan Reddy Supports Operation Sindhoor
  • దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమైన కర్తవ్యమన్న జగన్
  • ఉగ్ర చర్యలను మన రక్షణ దళాలు తిప్పికొట్టాయని వ్యాఖ్య
  • ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య అన్న వైసీపీ అధినేత
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, ఉగ్రవాదుల దాడుల నుంచి పౌరులను రక్షించేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా 'ఆపరేషన్ సిందూర్' వంటివి అనివార్యమని వైఎసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు కొందరు ముఖ్య నేతలతో ఆయన 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ఉగ్రవాద స్థావరాలు, వారి శిక్షణ శిబిరాలపై దాడులు చేయడం అనేది దేశ రక్షణలో కీలకమైన భాగమని అభిప్రాయపడ్డారు. "దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం" అని ఆయన స్పష్టం చేశారు.

కశ్మీర్‌లోని పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి క్రూరమైన ఉగ్ర చర్యలను భారత రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ప్రశంసించారు. "అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది" అని జగన్ తెలిపారు. దేశ పౌరుల భద్రత లక్ష్యంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న ప్రతి చర్యకు దేశం మొత్తం మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు.
Jagan Mohan Reddy
Operation Sindhoor
Terrorism
Anti-Terrorism
India
Kashmir
National Security
YSC Party
Counter-terrorism operations

More Telugu News