CV Anand: ఇది మాక్‌డ్రిల్.. ఎవరూ భయభ్రాంతులకు లోనుకావొద్దు: సీపీ సీవీ ఆనంద్

Hyderabad Mock Drill CP CV Anand Clarifies Siren Sounds
  • హైదరాబాద్‌లో వైమానిక దాడుల మాక్‌డ్రిల్‌
  • హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు సైరన్లు
  • అప్రమత్తతే లక్ష్యంగా హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ డ్రిల్‌
  • లోపాలను సమీక్షించి, సరిదిద్దుతామని సీపీ వెల్లడి
హైదరాబాద్‌ నగరంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా సైరన్లు మోగిన ఘటన నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్‌లో భాగమని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. ప్రజల్లో విపత్కర పరిస్థితులపై అవగాహన పెంచడంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పరీక్షించేందుకే ఈ సన్నాహక కార్యక్రమం చేపట్టామని, దీనిపై ఎవరూ భయభ్రాంతులకు లోనుకావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లో మాక్‌డ్రిల్‌ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, "పారిశ్రామిక సైరన్‌లు, పెట్రోల్‌ బంకుల వాహనాల సైరన్లు, పోలీస్‌ వాహనాల సైరన్లను ఏకకాలంలో మోగించాం. సైరన్ మోగిన వెంటనే ప్రజలు ఎక్కడివారు అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సూచనలు జారీ చేశాం. నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లుగా భావించి, మాక్‌డ్రిల్‌ను నిర్వహించాం" అని వివరించారు.

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పనితీరు, వారి ప్రతిస్పందన సమయాన్ని ఈ మాక్‌డ్రిల్స్‌ ద్వారా అంచనా వేశామని కమిషనర్ తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పురపాలక, పోలీస్‌, అగ్నిమాపక, విద్యుత్‌, రవాణా తదితర కీలక శాఖల సిబ్బంది వెంటనే నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం, మంటలను అదుపు చేయడం వంటివి ప్రదర్శించినట్లు చెప్పారు. ఫైరింజన్లు, అంబులెన్సులు వేగంగా సంఘటనా స్థలాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేయగా, వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, తీవ్రంగా గాయపడిన వారిని స్ట్రెచర్లపై ఆసుపత్రులకు తరలించే డ్రిల్ చేపట్టారని తెలిపారు.

"ఇలాంటి విపత్కర ఘటనలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎంత సమర్థవంతంగా, సమన్వయంతో పనిచేస్తుందో అంచనా వేయడమే ఈ మాక్‌డ్రిల్‌ ఉద్దేశం. కొన్ని లోపాలను కూడా గుర్తించాం. త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వాటిని అధిగమించేందుకు కృషి చేస్తాం. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని మెరుగైన చర్యలు తీసుకుంటాం" అని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రజలు ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఏదైనా సహాయం అవసరమైతే డయల్ 112కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఇది కేవలం ప్రజల అప్రమత్తత కోసమే చేపట్టిన సన్నాహక చర్య అని ఆయన పునరుద్ఘాటించారు.
CV Anand
Hyderabad Police Commissioner
Civil Mock Drill
Hyderabad Mock Drill
NDRF
SDRF
GHMC
Emergency Response
Disaster Management
Civil Defence

More Telugu News