Dhanunjaya Reddy: మద్యం కుంభకోణం కేసు: హైకోర్టులో ధనుంజయ రెడ్డి తదితరులకు చుక్కెదురు

Dhanunjaya Reddy and Others Denied Pre Arrest Bail in AP Liquor Scam
  • ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
  • ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేత
  • వీరిని నిందితులుగా (A31, A32, A33) చేర్చినట్లు సీఐడీ మెమో
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టులో వేగవంతమైన విచారణ, తీర్పు
  • నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రముఖులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న గోవిందప్ప బాలాజీలు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.

వారం రోజుల క్రితం వీరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఈ లోగా, అరెస్ట్ భయంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులోనే తేల్చుకోవాలని, కేసును త్వరగా విచారించి తీర్పు వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో ఈ ఉదయం నుంచి హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించగా, నిందితుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే తదితరులు వాదించారు.

ఇక, వాదనలు ముగిసిన అనంతరం, సాయంత్రం తీర్పు వెలువరించిన హైకోర్టు, ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

అటు, హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో కీలక మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ధనుంజయ రెడ్డిని A31గా, కృష్ణమోహన్ రెడ్డిని A32గా, గోవిందప్ప బాలాజీని A33గా నిందితుల జాబితాలో చేర్చినట్లు సీఐడీ పేర్కొంది. వీరి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో అరెస్ట్ కు మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Dhanunjaya Reddy
Andhra Pradesh Liquor Scam
AP CID
Pre-Arrest Bail Rejected
Krishna Mohan Reddy
Govindappa Balaji
High Court Verdict
YS Jagan Mohan Reddy
Indian Administrative Service
Bharati Cement

More Telugu News