KCR: భారత సైన్యం ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను: కేసీఆర్

KCR Praises Indian Armys Operation Sindoor
  • భారత సైన్యంపై కేసీఆర్ ప్రశంసలు
  • ఉగ్రవాదం అంతం కావాలని పిలుపు
  • దేశ రక్షణలో సైన్యం అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం సమూలంగా అంతం కావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

"భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను" అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అది ప్రపంచ మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కచ్చితంగా అంతమొందించాలని ఉద్ఘాటించారు.

ప్రపంచ శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే ఉగ్రవాద నిర్మూలనకు సానుకూల దృక్పథంతో ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అప్పుడే ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని, శాంతిని స్థాపించగలమని తెలిపారు.

భారత సైన్యం ఎంతటి వీరోచితంగా దాడులు నిర్వహించిందో, అంతే అప్రమత్తతతో దేశ రక్షణ విధుల్లో నిమగ్నమై ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశ రక్షణ విషయంలో తామెవరికీ తీసిపోమని నిరూపించేలా మన సైనికులకు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉండాలని తాను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు సైన్యం నిరంతర అప్రమత్తతతో, శక్తియుక్తులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
KCR
Indian Army
Operation Sindhoor
Terrorism
BRS
National Security
India
Military Operation
K Chandrashekar Rao
World Peace

More Telugu News