Rohit Sharma: టెస్టుల్లో టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడేనా?

Shubman Gill The Frontrunner for Team Indias Test Captaincy
  • టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ విరమణ ప్రకటన
  • కొత్త కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా
  • ఇంగ్లండ్ తో సిరీస్ కు త్వరలోనే కెప్టెన్ ప్రకటన
భారత క్రికెట్ జట్టులో మరో కీలక అధ్యాయం ముగిసింది. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో, జట్టు సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేది బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందున్న అతిపెద్ద ప్రశ్నగా మారింది. గతంలో సౌరవ్ గంగూలీకి రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీకి విరాట్ కోహ్లీ వంటి సమర్థులైన వారసులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆ పరంపర అక్కడితో ఆగిపోయినట్లే కనిపిస్తోంది. రోహిత్ శర్మ 33 ఏళ్ల వయసులో పగ్గాలు అందుకున్నప్పుడు, అతని కెప్టెన్సీ ప్రస్థానం ధోనీ లేదా కోహ్లీ అంత సుదీర్ఘంగా ఉండదని ఊహించిందే. అయినప్పటికీ, దాదాపు నాలుగేళ్లపాటు జట్టును విజయవంతంగా నడిపించాడు.

రోహిత్ నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని, ముఖ్యంగా కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేయడం బీసీసీఐకి పెను సవాలుగా మారింది. సుమారు ఆరు నెలల క్రితం వరకు, జస్ప్రీత్ బుమ్రా భారత టెస్ట్ జట్టు తదుపరి కెప్టెన్‌గా పట్టాభిషిక్తుడవుతాడని అంతా భావించారు. కానీ, వెన్నునొప్పి (స్ట్రెస్ ఫ్రాక్చర్) కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమవ్వడంతో ఆ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. తరచూ గాయాల బారిన పడే ఆటగాడికి కెప్టెన్సీ అప్పగించడం సరైంది కాదనే వాదన బలపడింది. దీంతో బుమ్రా కెప్టెన్సీ ఆశలు ప్రస్తుతానికి అటకెక్కాయని చెప్పవచ్చు.

మరోవైపు, ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శుభ్‌మన్ గిల్. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు ప్రతిభావంతుడు, సుదీర్ఘ భవిష్యత్తు ఉన్నవాడు. గత ఏడాది కాలంగా బీసీసీఐ సంకేతాలను గమనిస్తే, గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టమవుతోంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను అతను నడిపించిన తీరు, జట్టును పట్టికలో అగ్రస్థానంలో నిలపడం అతని నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా నిలిచాయి. టైటాన్స్ జట్టు సభ్యులు అతని నాయకత్వాన్ని ఇష్టపడతారని, అసిస్టెంట్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా గిల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నట్లు సమాచారం.

అయితే, విదేశీ గడ్డపై గిల్ బ్యాటింగ్ ప్రదర్శన అతని కెప్టెన్సీ అవకాశాలకు పెద్ద సవాల్‌గా మారింది. స్వదేశంలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, విదేశాల్లో అతని గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. భారత్‌లో ఆడిన 32 టెస్టుల్లో 1893 పరుగులు చేసిన గిల్, 35 సగటుతో ఐదు సెంచరీలు సాధించడం ద్వారా సుదీర్ఘకాలం జట్టులో కొనసాగగలడని నిరూపించుకున్నాడు. కానీ, విదేశాల్లో ఆడిన 13 టెస్టుల్లో కేవలం 649 పరుగులు మాత్రమే చేయడం అతని అభ్యర్థిత్వానికి ప్రతికూలంగా మారవచ్చు. విదేశాల్లో అతను సాధించిన ఏకైక సెంచరీ (110) బంగ్లాదేశ్‌పై ఛటోగ్రామ్‌లో వచ్చింది.

అది కాకుండా, విదేశాల్లో మరో రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేసిన గిల్, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బాలో 91, మెల్‌బోర్న్‌లో 50 పరుగులతో టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. కానీ, కాలక్రమేణా స్వింగింగ్ బంతుల ముందు తడబడుతూ నిలకడను కోల్పోయాడు. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన, బ్యాటింగ్ లైనప్‌లో సీనియర్ ఆటగాడిగా గిల్‌కు అత్యంత కీలక సిరీస్ కానుంది.

ఇక, బుమ్రా గతంలో మూడు టెస్టులకు భారత్‌కు నాయకత్వం వహించాడు, అందులో ఒకటి గెలిచి రెండింటిలో ఓటమి చవిచూశాడు. రోహిత్ గాయపడటంతో, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్టులో బుమ్రా తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్ ను 2-2తో ఇంగ్లాండ్ సమం చేసింది

ఆ తర్వాత పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో టీమిండియాకు ఘనవిజయం అందించాడు. సిడ్నీలో జరిగిన ఐదవ, చివరి టెస్టుకు రోహిత్ దూరంగా ఉండటంతో బుమ్రా మళ్లీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు. కానీ, అదే మ్యాచ్‌లో తీవ్రమైన వెన్ను గాయానికి గురై జట్టుకు దూరమయ్యాడు. ఈ గాయం అతని పూర్తిస్థాయి కెప్టెన్సీ కలలను కూడా దెబ్బతీసింది. దీంతో, భారత టెస్ట్ జట్టుకు సరైన నాయకుడిని ఎంపిక చేయడం బీసీసీఐకి సవాలుగా మారింది.
Rohit Sharma
Team India Test Captain
Shubman Gill
Jasprit Bumrah
BCCI
Indian Cricket Team
Next Test Captain
Cricket Captaincy
IPL Captain

More Telugu News