Nara Lokesh: ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: నారా లోకేశ్

Nara Lokeshs Appeal Stand by Chandrababu Naidu
  • సత్యవేడులో టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సమన్వయ భేటీ
  • సీఎం చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని శ్రేణులకు ఉద్బోధ
  • దేశ శత్రువులపై ప్రధాని మోదీ చర్యలకు పూర్తి మద్దతు ప్రకటన
  • 10 నెలల్లోనే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు
  • కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత, ఐక్యతకు పిలుపు
రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మోదీ వెంటే మనమంతా!

ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, దేశ శత్రువులపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. "పహల్గామ్ లో ఉగ్రవాదులు అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. మోదీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేం అండగా ఉంటాం. వంద పాకిస్థాన్‌లు వచ్చినా మన దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ అనే మిసైల్ ఉంది. భారతీయులను చంపిన వారిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు" అని అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పోరాడుతున్న సైనికులను ఆయన ప్రశంసించారు.

వారే నాకు స్ఫూర్తి

నియోజకవర్గ పర్యటనల్లో తొలుత కార్యకర్తలతోనే సమావేశమవుతానన్న మాటకు కట్టుబడి ఉన్నానని లోకేశ్ తెలిపారు. కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదని, వారి త్యాగాలే పార్టీకి స్ఫూర్తి అని అన్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేస్తుంటే వీరోచితంగా పోరాడిన అంజిరెడ్డి తాత, బూత్‌లో రిగ్గింగ్ అడ్డుకునేందుకు రక్తం చిందించిన మంజులారెడ్డి, మెడపై కత్తి పెట్టినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, మహానాడు నాటికి కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం

పార్టీలో సంస్కరణల కోసం కృషి చేస్తున్నానని, ఏ సమస్య అయినా అందరం కలిసి కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుందామని లోకేశ్ సూచించారు. "2019 నుంచి 2024 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చంద్రబాబు గారిని, నన్ను అనేక ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. నియోజకవర్గంలో ప్రత్యేక సమస్యలు ఉన్నందున ఇద్దరు పరిశీలకులను నియమించాం. ఇక్కడ జరిగే ప్రతి విషయం చంద్రబాబు గారికి తెలుసు. ఆయన కూడా కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు" అని తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమిగా ఏర్పడ్డామని, ప్రధాని మోదీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విజ్ఞప్తులను నెరవేరుస్తున్నారని లోకేష్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వలేదని, అమరావతి నిర్మాణానికి ప్రధాని మద్దతు పలికారని గుర్తుచేశారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ప్రస్తావించారు. అంతిమంగా, మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం చంద్రబాబు పడుతున్న తపనకు మనమంతా అండగా నిలవాలని మరోసారి ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోన్ ఇన్‌ఛార్జి దీపక్ రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి.నరసింహ యాదవ్, పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు, బాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ డా.శ్రీపతిబాబు తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Chandrababu Naidu
Telugu Desam Party
TDP
Andhra Pradesh Politics
Modi
Narendra Modi
Pawan Kalyan
Satyavedu
Tirupati

More Telugu News