Dinesh Kumar: సరిహద్దులో కొనసాగుతున్న ఎదురుకాల్పులు .. భారత జవాను వీరమరణం

Indian Soldier Killed in Cross Border Firing
  • నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ సైనికుల కాల్పులు 
  • పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం
  • బుధవారం అర్దరాత్రి పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ మృతి 
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. మరోవైపు సరిహద్దులో పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే.

కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతుండటంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను వీరమరణం పొందినట్లు తెలిసింది. పాక్ షెల్లింగ్‌లో గాయపడిన 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 12 మంది భారత పౌరులు మృతి చెందగా, 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. 
Dinesh Kumar
India-Pakistan border
Firing
Cross border firing
Pakistani shelling
Operation Sindhu
Kupwara
Baramulla
Uri
Akhnur

More Telugu News