Sania Mirza: సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ఫొటోతో 'ఆపరేషన్ సిందూర్'పై సానియా మీర్జా ప‌వ‌ర్‌ఫుల్‌ సందేశం

Sania Mirzas Powerful Message on Operation Sundar
  • పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'
  • ఈ ఆప‌రేష‌న్‌పై కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా మీడియాకు వివ‌ర‌ణ‌
  • ఇలా ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడంపై సానియా మీర్జా ప‌వ‌ర్‌ఫుల్‌ సందేశం
పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వ‌హించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను బుధ‌వారం ఉద‌యం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు వివరించారు. 

ఇలా ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడంపై భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్ మీడియాలో ప‌వ‌ర్‌ఫుల్‌ సందేశాన్ని పంచుకున్నారు. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా ఆపరేష‌న్ సిందూర్ గురించి చేసిన బ్రీఫింగ్‌పై జర్నలిస్ట్ ఫయే డిసౌజా చేసిన పోస్ట్‌ను సానియా మీర్జా పంచుకున్నారు.

"ఈ శక్తిమంతమైన ఫోటోలోని సందేశం ఒక దేశంగా మనం ఎవరో సంపూర్ణంగా వివ‌రిస్తుంది" అని డిసౌజా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇదే పోస్టును సానియా మీర్జా షేర్ చేశారు.

కాగా, పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను చంపడంతో మహిళలు వితంతువులుగా మారారు. వారి గౌరవార్థం... ఇండియ‌న్‌ ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌‌'కు సంబంధించిన పూర్తి వివరాలను భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు వివరించారు. ఈ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులే తెలియజేయడం కూడా 'ఆపరేషన్ సిందూర్'లో భాగమని స‌మాచారం. 

ఇక, 'ఆప‌రేష‌న్ సిందూర్‌'లో భాగంగా ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్‌లోని స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ తొమ్మిది ప్రదేశాలలో ఐదు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉంటే... నాలుగు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. ఇవన్నీ ఉగ్రవాద శిబిరాలకు స్థావరాలుగా నిఘా సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. ఈ ప్రదేశాలు లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM) వంటి ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు కంచు కోట‌లు. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు గ‌త కొన్నేళ్లుగా భార‌త్‌లో అనేక‌ దాడులకు పాల్ప‌డి ఎంతోమంది అమాయ‌కుల‌ను పొట్టనబెట్టుకున్నాయి.

Sania Mirza
Operation Sundar
Sofia Khureshi
Vyomika Singh
Pakistan
Indian Army
Pulwama
Terrorist attack
Counter-terrorism
Surgical Strike

More Telugu News