Malala Yousafzai: ద్వేషం, హింసే మన ఉమ్మడి శత్రువు.. మలాలా యూసఫ్‌జాయ్

Malala Yousafzai Calls for Peace Amidst India Pakistan Tensions
  • భారత్-పాక్ ఉద్రిక్తతల చల్లార్చేందుకు మలాలా పిలుపు
  • భారత్, పాక్ పౌరులు ఒకరికొకరు శత్రువులు కాదన్న మలాలా
  • అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఇరు దేశాలు సంయమనం పాటించాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాల ప్రజలు ఒకరికొకరు శత్రువులు కాదని, ద్వేషం, హింసలే మనందరి ఉమ్మడి శత్రువులని మలాలా స్పష్టం చేశారు. "ద్వేషం, హింస మన ఉమ్మడి శత్రువులు, మనం ఒకరికొకరం కాదు. ఉద్రిక్తతలు తగ్గించడానికి, పౌరులను, ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి, విభజన శక్తులకు వ్యతిరేకంగా ఏకం కావడానికి భారత్, పాకిస్థాన్ నాయకులు చర్యలు తీసుకోవాలని నేను గట్టిగా కోరుతున్నాను" అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇరు దేశాల్లోని అమాయక బాధితుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ "ఈ ప్రమాదకర సమయంలో పాకిస్థాన్‌లోని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, మేం కలిసి పనిచేస్తున్న విద్యావేత్తలు, బాలికలందరి గురించి నేను ఆలోచిస్తున్నాను" అని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. "మనందరి భద్రత, శ్రేయస్సు కోసం శాంతి ఒక్కటే ముందున్న మార్గం" అని మలాలా నొక్కి చెప్పారు.
Malala Yousafzai
India-Pakistan tensions
Kashmir
Peace
Violence
Terrorism
Nobel Peace Prize
International Relations
South Asia
Conflict Resolution

More Telugu News