KA Paul: జగన్ అసలు క్రిస్టియనే కాదు: కేఏ పాల్

KA Pauls Sensational Remarks on Jagans Religious Identity
  • చిన్నజీయర్ భక్తుడు జగన్ అన్న కేఏ పాల్
  • చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్, కేటీఆర్ మోదీకి తొత్తులని ఘాటు విమర్శ
  • సీఎం లేదా పీఎం అయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలువురు రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడని, చిన్నజీయర్ స్వామికి శిష్యుడని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వివాదాన్ని సృష్టించి హిందూ, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని ఆరోపించారు. జగన్ ఎన్నడూ తనను కలవలేదని, చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు.

రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులైనా ఆ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని పాల్ విమర్శించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ సీమకు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఆర్డీటీ సంస్థ సత్యసాయిబాబా కంటే ఎక్కువగా ప్రజలకు సేవలందించిందని కొందరు అంటున్నారని చెప్పారు. అలాంటి సంస్థకు ఎన్నికల పేరుతో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను నిలిపివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి నేతలే దీనిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంలో రెండో కీలక వ్యక్తితో మాట్లాడానని, ఆర్డీటీకి న్యాయం జరగకపోతే ప్రపంచాన్ని దించుతానని హెచ్చరించారు. ఇదే తన డెడ్‌లైన్ అని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు 30 వేల మంది అదృశ్యమైన అమ్మాయిల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయారని, ఒకప్పుడు మోదీని విమర్శించి ఇప్పుడు ఆయనే గొప్ప ప్రధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైతం గతంలో మోదీని దుమ్మెత్తిపోసి, ఇప్పుడు విశ్వగురు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారని విమర్శించారు. లోకేశ్ అయితే మోదీని వంద మిసైళ్లతో పోల్చారని, కానీ ఆ మిసైల్ హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే 'పడిపోయే మిసైల్' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, జగన్, కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలంతా మోదీకి తొత్తులుగా మారిపోయారని పాల్ ఆరోపించారు. వారెవరూ మోదీని ధైర్యంగా ఎదుర్కోలేరని, ఆ దమ్మున్నది కేవలం తనకు మాత్రమేనని అన్నారు. ఏపీ, తెలంగాణల్లో చెరో వంద సీట్లలో తన పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతానని, లేదా 42 ఎంపీ సీట్లిస్తే ప్రధానమంత్రి అయి దేశాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణకు అప్పు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వాపోతున్నారని, ఆయన ఏడుపు చూస్తుంటే జాలి వేస్తోందని పాల్ వ్యాఖ్యానించారు. 1989లో తాను అమెరికా వెళ్లినప్పుడు భారత్, చైనా జీడీపీ సమానంగా ఉండేదని, కానీ ఇప్పుడు చైనా మనకంటే ఏడు రెట్లు అభివృద్ధి చెంది వంద దేశాలకు అప్పులిస్తుంటే, భారత్ మాత్రం వంద దేశాల వద్ద అప్పులు తీసుకునే దుస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అప్పులు తీర్చాలన్నా, హైదరాబాద్ వంటి నగరాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్మించాలన్నా, యువతకు ఉద్యోగాలివ్వాలన్నా కేఏ పాల్ అధికారంలోకి రావాలని, 'పాల్ అన్న రావాలి.. పాలన మారాలి' అని ఆయన నినదించారు.
KA Paul
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
Revanth Reddy
KCR
KTR
Andhra Pradesh Politics
Telangana Politics
Indian Politics

More Telugu News