Khawaja Asif: సీఎన్ఎన్ తో మాట్లాడుతూ అభాసుపాలైన పాక్ రక్షణ మంత్రి... వీడియో ఇదిగో!

Pakistan Defense Minister Khawaja Asifs Embarrassing CNN Interview
  • పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • 5 భారత విమానాలను కూల్చివేశామని వెల్లడి
  • ఆధారం అడిగిన టీవీ యాంకర్
  • ఏం చెప్పాలో  తెలియక తడబాటుకు గురైన పాక్ మంత్రి
  • భారత సోషల్ మీడియాలో వస్తోంది అంటూ జవాబు
పాకిస్థాన్ రాజకీయ నేతలు పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై అభాసుపాలవడం కొత్తేమీ కాదు. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఓ ప్రముఖ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ నవ్వులపాలయ్యారు. ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని యాంకర్ కోరగా, మంత్రి ఇచ్చిన సమాధానం విస్మయానికి గురిచేసింది. 

సీఎన్ఎన్ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, "భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను మా సైన్యం కూల్చివేసింది" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకు స్పందించిన యాంకర్, "మీరు చెబుతున్నట్లు ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేశారు అనడానికి మీ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి?" అని సూటిగా ప్రశ్నించారు. యాంకర్ ప్రశ్నతో మంత్రి కొంత ఇబ్బందికి గురైనట్లు కనిపించింది.

అనంతరం ఆయన బదులిస్తూ, "ఈ సమాచారం అంతా భారత సోషల్ మీడియాలోనే వస్తోంది... మా సోషల్ మీడియాలో కాదు" అని వింత వాదన వినిపించారు. మంత్రి సమాధానంతో విస్తుపోయిన యాంకర్, "మీరు దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు ఆధారాలతో మాట్లాడాలి కానీ, సోషల్ మీడియా గురించి ప్రస్తావించడం సరికాదు కదా?" అని ఘాటుగా బదులిచ్చారు.

ఈ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పాకిస్తాన్ వాదనల్లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని పలువురు అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Khawaja Asif
Pakistan Defense Minister
CNN Interview
India-Pakistan Relations
Social Media
Viral Video
Controversial Statements
International Relations
Pakistan Politics
Air Force

More Telugu News