Chandrababu Naidu: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

AP Cabinets Key Decisions
  • ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ తీర్మానం
  • చెరువు మట్టిని రైతులకు ఉచితంగా తరలించేందుకు అనుమతి 
  • వేదికలపై తన పక్కన పవన్ కల్యాణ్ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, పరిపాలనా పరమైన పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది.

రాష్ట్ర మంత్రివర్గం 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ఆపరేషన్ నిర్వహించిన త్రివిధ దళాలను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా, అమరావతిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలియజేసింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది.

ప్రధానంగా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.

సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల అమలుపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కూడా మంత్రులు చర్చించారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా ప్రధాన వేదికపై సీటింగ్ ఏర్పాట్ల అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రులను ఒకవైపు, రాష్ట్ర మంత్రులను మరోవైపు కూర్చోబెట్టేలా ప్రోటోకాల్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తన పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.

జలవనరుల శాఖ పరిధిలో కంపెనీల చట్టం కింద జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని చెరువులలో పూడికతీత ద్వారా లభించే మట్టిని రైతులు తమ పొలాలకు ఉచితంగా తరలించుకునేందుకు అనుమతిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటుకు, అలాగే పర్యాటక ప్రాజెక్టులలో ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 
Chandrababu Naidu
AP Cabinet
Amaravati
Andhra Pradesh
Operation Sindhoor
Narendra Modi
CRDA
Welfare Schemes
Water Resources
TTD

More Telugu News