Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై సచిన్ భావోద్వేగ స్పందన

Rohit Sharma Announces Test Retirement Sachins Emotional Response
  • టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హిట్ మ్యాన్
  • 2013లో రోహిత్  కు టెస్ట్ క్యాప్ అందించిన క్షణాలను గుర్తుచేసుకున్న సచిన్
  • రిటైర్మెంట్ పట్ల శుభాకాంక్షలు చెబుతున్నట్టు వెల్లడి
'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలకడం తెలిసిందే. వచ్చే నెలలో ప్రారంభం కానున్న కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను, క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, వన్డే ఫార్మాట్‌లో తాను కొనసాగుతానని రోహిత్ స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్టులకు రోహిత్‌ రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల భావోద్వేగభరితంగా స్పందించాడు.

2013లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్యాప్ అందజేసిన విషయం తెలిసిందే. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సచిన్ స్పందించాడు. "2013లో ఈడెన్ గార్డెన్స్‌లో నీకు టెస్ట్ క్యాప్ అందించిన క్షణాలు, అలాగే మొన్న వాంఖడే బాల్కనీలో నీతో నిలబడిన సందర్భం నాకు గుర్తున్నాయి. నీ ప్రస్థానం అద్భుతమైనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు నీ అత్యుత్తమ సేవలు అందించావు. నీ టెస్ట్ కెరీర్‌కు అభినందనలు, భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని సచిన్ పేర్కొన్నాడు.

రోహిత్ తన టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు

గత ఏడాది బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం విరాట్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20 ఫార్మాట్ నుంచి రిటైరైన విషయం విదితమే. ఇటీవల దుబాయ్‌లో జరిగిన వన్డే ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు.

గత ఏడాది మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే రోహిత్‌కు చివరి టెస్ట్. ఆ మ్యాచ్‌లో భారత్ 184 పరుగుల తేడాతో ఓటమిపాలై, సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. రోహిత్ తన రెండో బిడ్డ జననం కారణంగా దూరమైన తొలి టెస్టుకు, అలాగే సిరీస్‌లోని చివరి టెస్టుకు కూడా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Rohit Sharma
Retirement
Sachin Tendulkar
Test Cricket
India Cricket
Hitman
England Tour
ODI Cricket
Cricket News
Jasprit Bumrah

More Telugu News