Alima Khan: ఐదు భారత జెట్లు కూల్చామంటున్నారు... మరి భారత డ్రోన్లు రావల్పిండి వరకు ఎలా వచ్చాయి?: అలీమా ఖాన్

Alima Khan Questions Pakistans Claim of Shooting Down Indian Jets
  • 5 భారత విమానాలు కూల్చామన్న పాక్ ప్రధాని షెహబాజ్
  • ఇది పూర్తిగా అబద్ధమని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఖండన
  • షెహబాజ్ షరీఫ్, భారత ప్రధాని మోదీ కుమ్మక్కయ్యారని అలీమా తీవ్ర ఆరోపణ
  • రావల్పిండి వరకు భారత డ్రోన్లు వస్తుంటే, విమానాలను ఎలా కూల్చారని ప్రశ్న
  • మే 9 అల్లర్ల వార్షికోత్సవం వేళ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శ
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేసిందన్న ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. షెహబాజ్ షరీఫ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

జాతీయ అసెంబ్లీలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, 80 భారత విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకువచ్చి దాడులు చేశాయని, పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్) అప్రమత్తంగా వ్యవహరించి, ప్రతిస్పందనగా ఐదు భారత విమానాలను కూల్చివేసిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అలీమా ఖాన్ తప్పుబట్టారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, "ఈ విమానాలను కూల్చివేశామని వారు (ప్రభుత్వం) చెప్పుకుంటున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ ప్రచారం చేస్తోంది కదా? కానీ ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి డ్రోన్లు వస్తున్నాయి. అవి భారత్ నుంచి రావల్పిండి వరకు చొచ్చుకువస్తున్నాయి. అసలు అవి రావల్పిండి వరకు ఎలా చేరాయి?" అని అలీమా ఖాన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా, నవాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ కుమ్మక్కయ్యారని అలీమా సంచలన ఆరోపణలు చేశారు. మే 9 అల్లర్ల రెండో వార్షికోత్సవానికి ముందు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని లక్ష్యంగా చేసుకునేందుకే పాకిస్థాన్‌లో ఉద్దేశపూర్వకంగా ఈ పరిస్థితిని సృష్టించారని ఆమె ఆరోపించారు.
Alima Khan
Pakistan
Shehbaz Sharif
Imran Khan
India
Operation Sundar
Nawaz Sharif
Narendra Modi
Pakistan Air Force
Drone attacks

More Telugu News