Rohit Sharma: ఇండియన్ కామెంటేటర్లపై రోహిత్ శర్మ విమర్శలు

Rohit Sharma Criticizes Indian Cricket Commentators
  • కామెంట్రీలో అజెండా, వివాదాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న రోహిత్
  • మ్యాచ్ విశ్లేషణ, వ్యూహాలు తగ్గపోయాయని విమర్శ
  • విదేశీ కామెంట్రీ నాణ్యతతో పోల్చి అసంతృప్తి
టీమిండియా స్టార్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ కామెంటేటర్లు మరియు ప్రస్తుత క్రికెట్ జర్నలిజం పోకడలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, దేశంలోని కొందరు వ్యాఖ్యాతలు ఒక నిర్దిష్ట ఎజెండాతో వ్యాఖ్యానం చేస్తున్నారని, వివాదాలను సృష్టించడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అసలైన వార్తలను పక్కన పెట్టి, కేవలం వ్యూస్, లైక్‌ల కోసం అనవసర విషయాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రస్తుత కామెంట్రీలో మ్యాచ్‌కు సంబంధించిన లోతైన విశ్లేషణలు, వ్యూహాలపై చర్చ కొరవడిందని రోహిత్ అభిప్రాయపడ్డారు. "గతంలో క్రికెట్ కామెంట్రీ ఆట చుట్టూనే సాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు కామెంటేటర్ల మాటలు వింటే కొన్నిసార్లు చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది. నాణ్యమైన జర్నలిజం తగ్గిపోయింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో కామెంట్రీ భిన్నంగా, ఎంతో నాణ్యంగా ఉంటుందని, మన దేశంలో ఆ స్థాయి ఉండటం విమర్శించారు.

కొందరు వ్యాఖ్యాతలు ఏదో ఒక ఆటగాడిని లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత జీవితాలపై కూడా వ్యాఖ్యలు చేయడం తగదని రోహిత్ హితవు పలికారు. "చాలా మంది అభిమానులు క్రికెట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. వారికి కామెంటేటర్ల మసాలా అవసరం లేదు. ఒక ఆటగాడు ఎందుకు సరిగ్గా ఆడటం లేదు, ఫామ్ ఎందుకు కోల్పోయాడు, ఏం తప్పులు చేస్తున్నాడు వంటి విషయాలపై విశ్లేషణ ఉండాలి. అభిమానులు ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అనుకోరు" అని స్పష్టం చేశారు.

ఆటగాళ్లకు కొంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ నొక్కి చెప్పారు. "మేం కొన్నిసార్లు సరిగా ఆడలేకపోవచ్చు. అప్పుడు విమర్శించండి, తప్పులేదు. కానీ దానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఒక అజెండాతో విమర్శలు చేయడం సరికాదు" అని ఆయన పేర్కొన్నారు.
Rohit Sharma
Indian Cricket Commentators
Cricket Journalism
Podcast Interview
Cricket Commentary
India vs Rest
Sports Analysis
Indian Cricket Team
Rohit Sharma Criticism

More Telugu News