Jayam Ravi: మరోసారి తెరపైకి జయం రవి ఫ్యామిలీ మేటర్!

Jayam Ravi Family Matter Back in Spotlight
  • సింగర్ కెనీషాతో భార్యభర్తల మాదిరి ఓకే రకం డ్రస్సులో ఓ వేడుకకు హజరైన నటుడు జయం రవి
  • విడాకుల వ్యవహారం ఇంకా ప్రాసెస్‌లోనే ఉందన్న ఆర్తి రవి
  • సోషల్ మీడియాలో ఆర్తి రవి భావోద్వేగ పోస్టు
కోలీవుడ్ నటుడు జయం రవి కుటుంబ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గాయని కెనీషాతో ఆయన సంబంధం కలిగి ఉన్నారని, అందుకే తన అర్ధాంగి ఆర్తికి రవి విడాకుల నోటీసు ఇచ్చారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సంబంధం గురించి వస్తున్న వార్తలను జయం రవి ఖండించారు. సింగర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అప్పట్లోనే ప్రకటించారు.

ప్రస్తుతం ఆర్తితో విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. అయితే, తాజాగా సింగర్ కెనీషాతో కలిసి జయం రవి ఒక వేడుకలో భార్యాభర్తల మాదిరిగా పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఒకే రంగు దుస్తుల్లో జయం రవి, కెనీషా వేడుకలో పాల్గొనడంతో వారి డేటింగ్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రవి అర్ధాంగి ఆర్తి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో ఒక ప్రకటన విడుదల చేశారు.

గత ఏడాదిగా తాను ఏమీ మాట్లాడలేదని ఆమె పేర్కొన్నారు. తన కుమారుల ప్రశాంతతే ముఖ్యమని భావించి ఆరోపణలను భరించానని, అంత మాత్రాన తన వైపు న్యాయం లేదని కాదని ఆర్తి అన్నారు. ఈ రోజు ప్రపంచమంతా ఆ ఫోటోలను (జయం రవి, కెనీషా) చూసిందని, తమ విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని ఆమె తెలిపారు. 18 ఏళ్లు కలిసి ఉన్న వ్యక్తి ఇలా చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని నెలలుగా పిల్లల బాధ్యతను తానే చూసుకుంటున్నానని, రవి నుంచి ఆర్థికంగానే కాకుండా నైతికంగా కూడా మద్దతు కరువైందని ఆమె వాపోయారు. దీనికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైందని, ఒకప్పుడు తాను లెక్కల కంటే ప్రేమకే విలువ ఇచ్చానని ఆమె పేర్కొన్నారు.

10, 14 ఏళ్ల వయస్సు ఉన్న తన పిల్లలకు భద్రత కావాలని, చట్టపరమైన విషయాలు వారికి తెలియకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరని ఆమె అన్నారు. ఫోన్ చేస్తే స్పందించకపోవడం, సమావేశాలు రద్దు చేయడం, సందేశాలకు సమాధానం ఇవ్వకపోవడం వంటివి గాయాల్లాంటివని ఆమె పేర్కొన్నారు. తాను ఈ రోజు ఒక భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాకుండా పిల్లల శ్రేయస్సు కోరుకునే తల్లిగా మాట్లాడుతున్నానని ఆమె అన్నారు.

తాను ఇప్పుడు మాట్లాడకపోతే వారి (పిల్లలకు) భవిష్యత్తు ఉండదని ఆమె అన్నారు. తండ్రి అనేది కేవలం టైటిల్ మాత్రమే కాదని, అది ఒక బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. తమ విడాకుల విషయంలో తుది తీర్పు వచ్చే వరకూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరు ఆర్తి రవిగానే ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఏడవడం లేదని, అరవడం లేదని, ఇప్పటికీ నాన్న అని పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డానని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. 
Jayam Ravi
Arthi Ravi
Kanishka
Divorce
Kollywood Actor
Family Dispute
Social Media Post
Relationship Rumors
Legal Battle
Child Custody

More Telugu News