Colonel Sofia Qureshi: సరిహద్దుల వైపు కదులుతున్న పాక్ సైన్యం

Pakistan Army Moving Towards Borders Colonel Sofia Qureshis Statement
  • మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడి
  • భారత సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని వ్యోమికా సింగ్ వివరణ
  • పాక్ లోని ఓ రాడార్ కేంద్రం, ఏవియేషన్ బేస్ ను భారత బలగాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి
భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పాకిస్థాన్ మరింత పెంచుతోందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ పై శనివారం ఉదయం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు పెట్టింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ..  పాక్ సైన్యం భారత సరిహద్దుల వైపు కదులుతోందని చెప్పారు.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. పాక్ బలగాలు సరిహద్దులవైపు కదలడం కచ్చితంగా ప్రమాదకరమైన చర్యేనని స్పష్టం చేశారు. పంజాబ్ లోని వాయుసేన స్థావరాలపై శనివారం తెల్లవారుజామున హైస్పీడ్ మిసైళ్లతో పాక్ దాడులు చేసిందని తెలిపారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ లలోని వైద్య కేంద్రాలపై దాడి చేసిందని చెప్పారు. ఇది ముమ్మాటికీ భారత్ ను రెచ్చగొట్టే చర్యేనని తెలిపారు. భారత మిలిటరీ స్థావరాలపై పాక్ చేస్తున్న దాడులను మన సైన్యం తిప్పికొట్టిందని వివరించారు.

పాక్ దాడులకు ప్రతస్పందిస్తూ ఆ దేశంలోని మిలటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై భారత్ దాడి చేసిందని ఖురేషీ వివరించారు. ఫైటర్‌ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి పస్రూర్‌లోని రాడార్‌ కేంద్రం, సియాల్‌ కోట్‌లోని ఏవియేషన్‌ బేస్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇదే అంశాన్ని వ్యోమికా సింగ్‌ అంతర్జాతీయ మీడియా కోసం ఆంగ్లభాషలో వెల్లడించారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్‌ స్టాంప్‌లు ఉన్న వీడియోలు, ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు.
Colonel Sofia Qureshi
Pakistan Army
India-Pakistan tensions
Cross-border movement
Military escalation
Surgical strike
Indian Air Force
Pakistani military bases
Operation Sindhu
Vikram Misri
Wyomika Singh

More Telugu News