Chiranjeevi: జగదేకవీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ లో ఎంత వసూలు చేసిందంటే...!

Jagadeka Veerudu Atiloka Sundari Re release Box Office Collection
  • ఈ నెల 9న థియేటర్లలో రీ రిలీజ్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ
  • ఒక్క రోజులోనే దాదాపు కోటి 75 లక్షల వసూళ్లు రాబట్టినట్లు పేర్కొన్న నిర్మాణ సంస్థ
  • భారీ స్థాయి కలెక్షన్లపై ఆనందం వ్యక్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఈ చిత్రం 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో రీ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ.8 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు సమాచారం. నిర్మాణ సంస్థ అంచనాలకు అనుగుణంగానే ఈ చిత్రానికి మెగా అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు ఈ చిత్రాన్ని తిలకిస్తుండటంతో భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.

రీ రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు రూ.1.75 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. వీకెండ్‌లో కలెక్షన్ భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్‌కు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రముఖ నిర్మాత పి. అశ్వినీదత్ తన ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై 1990లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 1990 మే 9న ఈ చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది.

ఇందులో టూరిస్ట్ గైడ్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఇంద్రజ పాత్రలో ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి, ఇతర ముఖ్య పాత్రల్లో అమ్రిశ్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలినీ వంటి వారు నటించారు. 
Chiranjeevi
Sridevi
Jagadeka Veerudu Atiloka Sundari
Re-release
Box Office Collection
Tollywood
Telugu Cinema
K Raghavendra Rao
Vijayashanti Movies

More Telugu News