Pakistan-India Conflict: కాల్పుల విరమణకు ముందు ఏం జరిగింది?

Pakistan Violates Ceasefire India Responds to Drone Attacks
  • పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు
  • అడ్డుకట్ట వేయాలని అమెరికాను కోరిన పాక్
  • భారత్‌తో మాట్లాడాలని గట్టిగా చెప్పిన యూఎస్ 
  • హాట్‌లైన్‌లో భారత్‌తో టచ్‌లోకి పాక్ డీజీఎంవో 
నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి నాలుగు రోజుల పాటు సాగిన క్షిపణి దాడులు, డ్రోన్ల చొరబాట్లు, ఫిరంగి దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్ అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం మే 10వ తేదీ సాయంత్రం నుంచి భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో అమల్లోకి వచ్చింది.   

పాకిస్థాన్ వైమానిక దళ స్థావరాలపై 10న తెల్లవారుజామున భారత వైమానిక దళ విమానాలు దాడులు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ నెట్‌వర్క్‌లలో హై అలర్ట్ సందేశాలు వెలువడినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. భారత్ తదుపరి పాకిస్థాన్ అణ్వాయుధ కమాండ్, నియంత్రణ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాందోళనలు పాక్‌లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని అమెరికాను పాక్ ఆశ్రయించింది. ఉద్రిక్తతలు పెరుగుతాయని ముందే ఊహించిన అమెరికా అధికారులు ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపారు. 

అమెరికా తొలుత  బహిరంగంగా తటస్థ వైఖరిని ప్రదర్శించినప్పటికీ, ఇస్లామాబాద్‌కు అమెరికా గట్టి సందేశం పంపినట్లు తెలుస్తోంది. అధికారిక సైనిక హాట్‌లైన్‌ను ఉపయోగించి తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఆదేశించింది. భారత సైన్యంతో ప్రత్యక్ష సంప్రదింపుల మార్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఎలాంటి జాప్యం చేయవద్దని అమెరికా ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మే 10న మధ్యాహ్నానికి పాకిస్థాన్ దూకుడుకు భారత్ అడ్డుకట్ట వేసిన తర్వాత పాకిస్థాన్ డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా.. భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు నేరుగా ఫోన్ చేశారు. ఈ కాల్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:35 గంటలకు జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో ధ్రువీకరించారు.

అయితే, నిర్దేశిత ప్రొటోకాల్‌కు వెలుపల పాకిస్థాన్‌తో ఎలాంటి అధికారిక దౌత్య లేదా సైనిక చర్చల్లో పాల్గొనకూడదనే తన వైఖరికి భారత్ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ న్యూఢిల్లీ మధ్యవర్తిత్వానికి అంగీకరించలేదు. బదులుగా భారత సాయుధ బలగాలు తదుపరి దశ తీవ్రతకు సిద్ధంగా ఉన్నాయని సంకేతాలిచ్చింది. ఈ దశలో ఇంధన, ఆర్థిక లక్ష్యాలపై సమన్వయ దాడులతో పాటు, మరింత లోతైన వ్యూహాత్మక కమాండ్ నిర్మాణాలపై దాడులు ఉండేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Pakistan-India Conflict
India-Pakistan Drone Attacks
Cross Border Firing
BrahMos Missile
Military Ceasefire
DGMO
Vikram Misri
Kashmir
Surgical Strikes
Indo-Pak Tension

More Telugu News