Pakistan: పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ ఫుటేజీతో పాక్ తప్పుడు ప్రచారం

Pakistani Fake Propaganda Using Childrens Video Game Footage
  • వీడియో గేమ్ దృశ్యాలను సైనిక చర్యగా చూపిన పాక్ యూజర్
  • భారత మహిళా పైలట్ పట్టివేత వార్త పూర్తిగా అబద్ధం: పీఐబీ
  • భారత సైనిక స్థావరాల ధ్వంసం ఆరోపణలు కల్పితం: భారత ఆర్మీ
భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్"లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైన నేపథ్యంలో పాకిస్థాన్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా యూజర్ ఒకరు పిల్లలు ఆడుకునే గేమ్ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘పాక్ సైనికుడి పరాక్రమం చూడండి. భారత యుద్ధ విమానాన్ని తరిమికొడుతున్నాడు’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే, యూకే డిఫెన్స్ జర్నల్ మీడియా ఈ పోస్టు ఫేక్ అని తేల్చేసింది. బార్నే స్టిన్సన్ అనే ‘ఎక్స్’ యూజర్ అప్ లోడ్ చేసిన ఈ వీడియో ‘ఆర్మా 3’ అనే వీడియో గేమ్ లోనిదని స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన వివరాలతో ఆ ఫేక్ ప్రచారాన్ని ఎండగట్టింది. ఇలాంటి కల్పిత యుద్ధ క్రీడల వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్-చెక్ విభాగం కూడా హెచ్చరించింది. ఇదే వీడియోను పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో, పాక్ మంత్రి అత్తావుల్లా తరార్ కూడా షేర్ చేశారని ఆరోపించింది. అయితే, పాక్ ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ ప్రస్తుతం ‘విత్ హెల్డ్’ లో ఉండగా, మంత్రి అత్తావుల్లా తరార్ ట్విట్టర్ హ్యాండిల్ లో మాత్రం ఈ పోస్ట్ కనిపించడంలేదు. భారత వైమానిక దళానికి చెందిన ఒక మహిళా పైలట్‌ను పాకిస్థాన్‌లో బంధించినట్లు కొన్ని పాకిస్థాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేశాయి. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, స్క్వాడ్రన్ లీడర్ శివాని సింగ్ అనే పైలట్‌ను బంధించారన్నది కల్పితమని పీఐబీ ఫ్యాక్ట్-చెక్ స్పష్టం చేసింది.

గత మూడు రోజులుగా పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను భారత సైనిక అధికారులు శనివారం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ, పాకిస్థాన్ తమ జెఎఫ్-17 విమానాలతో భారత ఎస్-400, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని తెలిపారు. అలాగే, సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి వాయుసేన స్థావరాలు దెబ్బతిన్నాయన్న వార్తలు కూడా నిరాధారమని ఆమె స్పష్టం చేశారు.
Pakistan
Fake News
Social Media Propaganda
Operation Sundar
India-Pakistan Conflict
Video Game Footage
Attahullah Tarar
Colonel Sofia Khureshi
PIB Fact Check
Misinformation

More Telugu News