Yogi Adityanath: బ్రహ్మోస్ సత్తా ఏంటో పాకిస్థాన్‌ను అడగండి: యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

CM Yogi praises Operation Sindoor says Ask Pakistan about the power of BrahMos
  • బ్రహ్మోస్ క్షిపణి శక్తి ఏంటో పాకిస్థాన్‌ను అడిగి తెలుసుకోమన్న యూపీ సీఎం యోగి
  • 'ఆపరేషన్ సిందూర్' విజయం బ్రహ్మోస్ సత్తాను ప్రపంచానికి చూపిందని ప్రశంస
  • లక్నోలో రూ.300 కోట్లతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభం
  • ఉగ్రవాదానికి  దాని భాషలోనే సమాధానం చెప్పాలని వ్యాఖ్య
  • ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై పోరాటానికి ఏకతాటిపై నిలవాలని పిలుపు
భారతదేశపు అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిపణి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో పాకిస్థాన్‌ను అడిగితే తెలుస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా బ్రహ్మోస్ క్షిపణి తన ప్రతాపాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన కొనియాడారు. లక్నోలోని ఉత్తర ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్' విజయం సాధించినందుకు భారత సాయుధ దళాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఉత్తర ప్రదేశ్ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు. "ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణి యొక్క ఒక  గ్లింప్స్ చూసి ఉండవచ్చు. ఒకవేళ చూడకపోతే, బ్రహ్మోస్ క్షిపణి శక్తి గురించి పాకిస్థాన్ వాళ్లను అడగండి. ఇకపై ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు" అంటూ యోగి గట్టిగా హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్‌ను రక్షణ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన కేంద్రంలో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేయనున్నారు. ఇది దేశీయ రక్షణ మౌలిక సదుపాయాలకు కీలక చేర్పు అని ఆయన అభివర్ణించారు.

ఉగ్రవాదంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, "ఉగ్రవాద సమస్యను పూర్తిగా అణిచివేసే వరకు దానికి పరిష్కారం లభించదు. ఇందుకోసం ప్రధాని మోదీ నాయకత్వంలో మనమందరం ఏకతాటిపై నిలబడి పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. దానికి దాని భాషలోనే సమాధానం చెప్పాలి. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా భారత్ యావత్ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చింది" అని యోగి స్పష్టం చేశారు.

భారత డీఆర్‌డీఓ, రష్యాకు చెందిన ఎన్‌పీఓ మషినోస్త్రోయేనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండి, మాక్ 2.8 వేగాన్ని అందుకోగలదు. దీన్ని భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. 

కాగా, లక్నో యూనిట్‌లో ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ ఏటా 100 నుంచి 150 నెక్ట్స్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులు తయారు కానున్నాయి. ఇవి ప్రస్తుత క్షిపణుల కంటే తేలికగా ఉండి, మరింత ఎక్కువ దూరం లక్ష్యాలను ఛేదించగలవు.
Yogi Adityanath
BrahMos Missile
Operation Sindhur
Pakistan
India
Defense
UP Defense Industrial Corridor
Supersonic Cruise Missile
Rajnath Singh
Narendra Modi

More Telugu News