IAF: ఆపరేషన్ సిందూర్ పై ఐఏఎఫ్ కీలక ప్రకటన

IAF Announces Success of Operation Sindhu
  • ఆపరేషన్ విజయవంతం.. ఇంకా కొనసాగుతోందని ట్వీట్
  • త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించిన వాయుసేన
  • అప్పటి వరకు ఊహాగానాలు ప్రచారం చేయొద్దని సూచన
"ఆపరేషన్ సిందూర్"లో భాగంగా తమకు అప్పగించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేశామని భారత వాయుసేన (ఐఏఎఫ్) ఆదివారం ప్రకటించింది. "జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, అత్యంత కచ్చితత్వంతో, వృత్తి నైపుణ్యంతో ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాం. కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున, తగిన సమయంలో సమగ్ర వివరాలు వెల్లడిస్తాం. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దు" అని ఐఏఎఫ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కోరింది.

ఇరు దేశాల మధ్య కాల్పులు, దాడుల విరమణకు శనివారం భారత్, పాకిస్థాన్ అంగీకారానికి వచ్చాయి. అయితే, ఒప్పందం కుదిరిన కాసేపటికే పాకిస్థాన్ సైన్యం మరోమారు సరిహద్దుల్లో రెచ్చిపోయింది. శ్రీనగర్‌తో పాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చేసింది. దీంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత్ మీడియాకు వెల్లడించింది.

ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్థాన్‌కు సూచించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉల్లంఘనలు పునరావృతమైనా దృఢంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

IAF
Operation Sindhu
India Pakistan Conflict
Cross Border Firing
Drone Attacks
Vikram Misri
Indo Pak Tension
ceasefire violation
Surgical Strike

More Telugu News