Rajnath Singh: రావల్పిండిలోనూ మన సైన్యం కదం తొక్కింది: రాజ్ నాథ్ సింగ్

Indian Armys Operation in Rawalpindi Rajnath Singhs Revelation
  • పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు
  • పౌరులకు హాని కలిగించలేదన్న రాజ్ నాథ్
  • ఉగ్రవాదంపై భారత దృఢ వైఖరికి నిదర్శనమన్న రాజ్‌నాథ్
  • లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రం ప్రారంభం
భారత సాయుధ బలగాలు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలపైనే కాకుండా, పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోని కీలక సైనిక స్థావరాలపై కూడా దాడులు చేసి తమ పోరాట పటిమను చూపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. లక్నోలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

"ఉగ్రవాదంపై భారత ప్రభుత్వ దృఢ సంకల్పానికి, మన సాయుధ బలగాల అపార శక్తిసామర్థ్యాలకు 'ఆపరేషన్ సిందూర్' నిలువెత్తు నిదర్శనం. ఉరి దాడుల అనంతరం సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి తర్వాత వైమానిక దాడుల మాదిరిగానే, పహల్గామ్ ఘటన అనంతరం 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని ప్రపంచానికి స్పష్టం చేశాం" అని రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని, సాధారణ పౌరులకు ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వివరించారు.

అయితే, పాకిస్థాన్ దీనికి భిన్నంగా వ్యవహరించిందని, మతపరమైన ప్రదేశాలతో సహా భారతీయ పౌర ప్రాంతాలపై దాడులకు తెగబడిందని ఆయన ఆరోపించారు. "ఇటువంటి దుశ్చర్యలకు ప్రతిగా మన సాయుధ బలగాలు అద్భుతమైన ధైర్యసాహసాలు, వ్యూహాత్మక సంయమనం ప్రదర్శించాయి. శత్రువులకు గట్టి గుణపాఠం చెబుతూ, పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండితో సహా పలు పాకిస్థానీ సైనిక స్థావరాలపై దాడులు చేసి దీటుగా స్పందించాయి" అని ఆయన గర్వంగా ప్రకటించారు. 

ఈ చర్యలతో సరిహద్దులకు ఆవల ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు లేవనే బలమైన, స్పష్టమైన సందేశాన్ని భారత్ పంపిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నవభారతం సరిహద్దులకు ఇరువైపులా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోందని, ఉగ్రవాదంపై పోరులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు
Rajnath Singh
Indian Army
Pakistan
Rawalpindi
Surgical Strikes
Operation Sindhu
POK
Terrorism
India-Pakistan relations
BrahMos

More Telugu News