Narendra Modi: పీవోకే మాదే... అప్పగించడం తప్ప పాక్ కు మరో మార్గం లేదు: ప్రధాని మోదీ

Modis Strong Stance on PoK Pakistan Has No Other Option
  • రేపు భారత్-పాక్ మధ్య కీలక చర్చలు
  • ఈ మధ్యాహ్నం మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం
  • పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరంలేదన్న మోదీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కుండబద్దలు కొట్టారు. పీవోకేను భారత్‌కు అప్పగించడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదని ఆయన సోమవారం ఢిల్లీలో స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరగనున్న తరుణంలో, ఒకరోజు ముందే ఈ అంశంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదని ప్రపంచానికి తేల్చిచెప్పారు. కశ్మీర్ విషయంలో భారత్ దృఢంగా ఉందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ, ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందించాలని ప్రధాని మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. "పాకిస్థాన్ ఒక్క తూటా పేలిస్తే, మీరు క్షిపణితో సమాధానం చెప్పండి" అంటూ సాయుధ బలగాలకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని, పాక్ దుందుడుకు చర్యలకు పాల్పడితే భారత్ దాడులు చేయడం ఖాయమని ప్రధాని హెచ్చరించారు.

ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే పీవోకే విషయంలో అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశం పంపడంతో పాటు, పాకిస్థాన్‌కు గట్టిగా బదులివ్వాలని సైనిక దళాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మధ్యవర్తిత్వంపై పరోక్ష వ్యాఖ్యలు

గతంలో పీవోకే విషయంలో అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, అది తమ అంతర్గత వ్యవహారమని, దానిని పాకిస్థాన్ తమకు అప్పగించాల్సిందేనని ప్రధాని మోదీ తాజా వ్యాఖ్యలతో పరోక్షంగా స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంలో మూడో పక్షం జోక్యానికి ఆస్కారం లేదనే సంకేతాలను భారత్ పంపినట్లయింది.

గతంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దాన్ని ఉల్లంఘించిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌ను పూర్తిగా విశ్వసించలేమని, అందుకే 'ఆపరేషన్ సిందూర్‌' వంటి చర్యలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని భారత ఆర్మీ వర్గాలు గతంలోనే సూచించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రధాని మోదీ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు స్పష్టమైన హెచ్చరికగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Narendra Modi
PoK
Pakistan
India
Kashmir
Operation Sundar
Rajnath Singh
S Jaishankar
Ajit Doval
Indo-Pak relations

More Telugu News