NTR: 'నాటు నాటు' పాట‌కి చిరంజీవి, బాల‌కృష్ణ‌ డ్యాన్స్ చేస్తే.. తార‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

NTRs Wish Chiranjeevi Balakrishna to Dance for Naatu Naatu
  • లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఘనంగా ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్
  • చెర్రీ, తార‌క్‌, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి
  • నాటు నాటు పాట‌లో చ‌ర‌ణ్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్ప‌టికి మ‌రిచిపోలేన‌న్న ఎన్టీఆర్
  • ఇదే పాట‌పై చిరు, బాల‌య్య డ్యాన్స్ చేస్తే ఒక మంచి జ్ఞాప‌కంగా మిగిలిపోతుంద‌ని వ్యాఖ్య  
చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఒకే వేదిక‌పై క‌నిపించి సంద‌డి చేశారు. తాజాగా లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీనికోసం చెర్రీ, తార‌క్‌, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేదిక‌పై ఎన్టీఆర్-రామ్ చ‌ర‌ణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఆత్మీయ ఆలింగ‌నంతో పాటు రామ్ చ‌రణ్‌.. తార‌క్‌కి ముద్దు పెట్ట‌డం హైలైట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కాగా, గ‌తంలో ఇదే వేదిక‌పై 'బాహుబలి' లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను నిర్వహించిన విష‌యం తెలిసిందే.

ఇక, వేదిక‌పై ఎన్టీఆర్ మాట్లాడుతూ... ఈ 'నాటు నాటు' పాట‌లో నా బెస్ట్ ఫ్రెండ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్ప‌టికి మ‌రిచిపోలేను. అయితే, చెర్రీ వాళ్ల నాన్న‌ చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్స‌రో మ‌నంద‌రికి తెలుసు. అలాగే మా బాబాయ్ బాల‌య్య‌ కూడా మంచి డ్యాన్స‌ర్. వీరిద్ద‌రు క‌లిసి నాటు నాటుకి డ్యాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చ‌రిత్ర‌లో మిగిలిపోతుంద‌ని తార‌క్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. దీనిపై నందమూరి, మెగా ఫ్యాన్స్ త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. చిరు, బాలయ్య క‌లిసి సినిమా చేయ‌క‌పోయిన క‌నీసం ఇలా ఓ పాట‌కి క‌లిసి డ్యాన్స్ చేస్తే ఆ ఆనందం మాటల్లో చెప్ప‌లేనిద‌ని వారు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, తార‌క్‌, చ‌ర‌ణ్ హీరోలుగా జ‌క్క‌న్న‌ తెర‌కెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. హాలీవుడ్ వాళ్లు సైతం తెలుగు సినిమా వైపు చూసేలా ఆర్ఆర్ఆర్ సినిమా సంచ‌ల‌నాలు సృష్టించింది.
NTR
Ram Charan
RRR Movie
Naatu Naatu Song
Chiranjeevi
Balakrishna
Royal Albert Hall
London Concert
RRR Live Concert
Oscar Award

More Telugu News