S Jaishankar: ఆపరేషన్ సిందూర్ గురించి జైశంకర్ అమెరికాకు ముందే హింట్ ఇచ్చారా..?

Did Jaishankar Hint at Operation Sindhoor to the US
  • పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న కేంద్రమంత్రి
  • పాకిస్థాన్ లోని ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తామని వెల్లడి
  • అమెరికా విదేశాంగ కార్యదర్శికి వారం ముందే స్పష్టం చేసినట్లు వివరణ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాకు ముందే స్పష్టం చేశారట. బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరగగా మే 1న అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో జైశంకర్ కు ఫోన్ చేశారు. ఉగ్రదాడికి సంబంధించి ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉందని ఆరోపిస్తూ ప్రతీకార దాడులు చేస్తామని జైశంకర్ స్పష్టం చేశారు. "పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై తప్పక చర్యలు తీసుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని జైశంకర్ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఉగ్రదాడికి ప్రతిగా భారత్ మే 7న "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడుల లక్ష్యం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమేనని, పాకిస్థాన్ సైనిక స్థావరాలు గానీ, పౌరులు గానీ లక్ష్యం కాదని స్పష్టం చేసింది.

భారత దాడుల అనంతరం పాకిస్థాన్ డ్రోన్లు, ఇతర ఆయుధాలతో ప్రతిదాడులకు యత్నించగా, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఇస్లామాబాద్ దుందుడుకు చర్యలకు తగిన రీతిలో సమాధానం చెప్పాయని అధికార వర్గాలు తెలిపాయి. మే 9, 10 తేదీల్లో భారత వైమానిక దాడులు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని, అవి "నిప్పుల వర్షం" కురిపించాయని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ వైఖరిలో ఇదొక నూతన అధ్యాయమని పేర్కొన్నాయి.
S Jaishankar
Operation Sindhoor
Pakistan
Terrorism
India
Counter-terrorism
Surgical Strikes
US
Marco Rubio
Lashkar-e-Taiba
Jaish-e-Mohammed
Hizbul Mujahideen

More Telugu News