Pawan Kalyan: న‌ర్సుల సేవ‌లు అన‌న్య సామాన్యం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

Pawan Kalyan Honors Nurses on International Nurses Day
  • నేడు అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం
  • పిఠాపురం నియోజ‌కవ‌ర్గానికి చెందిన ప్ర‌భుత్వ స్టాఫ్ న‌ర్సుల‌తో ప‌వ‌న్ భేటీ
  • విశిష్ట సేవ‌లు అందించిన 8 మంది న‌ర్సుల‌కు స‌త్కారం
  • వైద్య‌రంగంలో న‌ర్సుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌న్న డిప్యూటీ సీఎం
అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా పిఠాపురం నియోజ‌కవ‌ర్గానికి చెందిన ప్ర‌భుత్వ స్టాఫ్ న‌ర్సుల‌తో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. విశిష్ట సేవ‌లు అందించిన 8 మంది న‌ర్సుల‌ను ఉప‌ముఖ్య‌మంత్రి స‌త్కరించారు.  

అనంత‌రం ప‌వ‌న్ మాట్లాడుతూ... వైద్య రంగంలో న‌ర్సులు అందిస్తున్న సేవ‌లు అన‌న్య సామాన్యమ‌ని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగుల‌కు స్వ‌స్థ‌త క‌లిగేలా వృత్తికి గౌర‌వాన్ని తీసుకువ‌స్తున్నార‌ని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని అన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న న‌ర్సుల సేవ‌ల‌ను ఎవ‌రూ మ‌రిచిపోర‌ని తెలిపారు. 

మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా న‌ర్సులు చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయమ‌ని పేర్కొన్నారు. ఇక‌, ఇటీవ‌ల సింగ‌పూర్‌లో త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ పాఠశాల‌లో సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ త‌ర్వాత ఆసుప‌త్రిలో చేరాడ‌ని, అక్క‌డ న‌ర్సులు చేసిన సేవ‌లు చూసిన‌ప్పుడు మ‌రోసారి వారి క‌ష్టం గుర్తుకొచ్చింద‌ని చెప్పారు. 

అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారిని క‌లవ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని జ‌న‌సేనాని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా న‌ర్సులు త‌మ స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని, వాటిని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.     
Pawan Kalyan
AP Deputy CM
Nurses Day
Nursing Services
Healthcare
Florence Nightingale
Mark Shankar
Andhra Pradesh
Nurses' issues
Satyakumar Yadav

More Telugu News