Gautam Sawang: ఏపీపీఎస్సీ స్కాంలో గౌతమ్ సవాంగ్ హస్తం ఉంది: నీలాయపాలెం విజయ్ కుమార్ సంచలన ఆరోపణలు

APPSC Scam Gautam Sawangs Alleged Involvement  Shocking Revelations
  • ఏపీపీఎస్సీ కుంభకోణంలో సవాంగ్, తాడేపల్లి పెద్దల పాత్ర ఉందని ఆరోపణలు
  • కోర్టును తప్పుదారి పట్టించారని వెల్లడి
  • సవాంగ్, పీఎస్ఆర్ ఆంజనేయులు శిక్షార్హులన్న నీలాయపాలెం విజయ్ కుమార్
  • విచారణ జరిపించాలని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో తాడేపల్లిలోని కీలక వ్యక్తులతో పాటు అప్పటి ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా ఉందని బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్, టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గౌతమ్ సవాంగ్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) వెనుక అనేక అనుమానాలున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, "జగన్ నియమించిన గౌతమ్ సవాంగ్ నిజంగా తప్పు చేయకపోతే, ఇంకా మూడేళ్ల సర్వీసు ఉండగానే ఎందుకు వీఆర్ఎస్ తీసుకుని పారిపోయారో సమాధానం చెప్పాలి" అని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించడం అత్యంత కష్టమైన ప్రక్రియ అని, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కమిటీ వంటి అనేక దశలు దాటాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అలాంటిది, సవాంగ్ తనంతట తానుగా పదవి వదిలి వెళ్లడం వెనుక కుంభకోణంలో ఆయన పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు.

2018లో టీడీపీ హయాంలో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించిందని, అయితే మూల్యాంకన ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని విజయ్ కుమార్ ఆరోపించారు. "అత్యంత గోప్యంగా, అర్హులైన వారితో చేయించాల్సిన పేపర్ల మూల్యాంకనాన్ని, అప్పటి సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌లు కలిసి తమ అనుయాయులకు చెందిన 'కామ్‌సైన్' అనే సంస్థకు అప్పగించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో, ఎలాంటి అర్హత లేని వారితో డిజిటల్‌గా మూల్యాంకనం చేయించారు" అని విమర్శించారు.

ఈ అక్రమాలపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు జోక్యం చేసుకుని మ్యాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించిందని విజయ్ కుమార్ తెలిపారు. అయితే, కోర్టు ఆదేశాలను సైతం పక్కనపెట్టి, రెండోసారి విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న హాయ్‌ల్యాండ్ రిసార్టులో రహస్యంగా మూల్యాంకన కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. "ప్రొఫెసర్లు దిద్దాల్సిన పేపర్లను ఆటో డ్రైవర్ల భార్యలు, వెల్డర్లు, వంటవాళ్లు, చంటిపిల్లల తల్లులతో దిద్దించారు. ఇది అత్యంత దారుణం" అని అన్నారు. ఈ రెండో మూల్యాంకనం గురించి సవాంగ్, ఆంజనేయులు కోర్టుకు పచ్చి అబద్ధాలు చెప్పారని, హాయ్‌ల్యాండ్‌లో అసలు మూల్యాంకనమే జరగలేదని బుకాయించారని ఆరోపించారు. అయితే, అభ్యర్థులు ఫుడ్ బిల్లులు, సెక్యూరిటీ బిల్లులు వంటి ఆధారాలను కోర్టుకు సమర్పించారని తెలిపారు. రెండోసారి దిద్దిన ఫైళ్లను సవాంగ్ దాచిపెట్టారని కూడా విజయ్ కుమార్ ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంలో పీఎస్ఆర్ ఆంజనేయులు, కామ్‌సైన్ ఛైర్మన్ మధుపైనా కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో నియమితులైన ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్‌ను ఛాంబర్‌లోకి కూడా రానివ్వకుండా అవమానించారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. మద్యం కుంభకోణంలో సీబీఐ దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చినట్లే, ఏపీపీఎస్సీ కుంభకోణంపై కూడా సమగ్ర విచారణ జరిపి, గౌతమ్ సవాంగ్, పీఎస్ఆర్ ఆంజనేయుల పాత్రను తేల్చాలని, వారిని శిక్షించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకుంటున్న ఏపీపీఎస్సీ సభ్యులు ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారో, కోర్టును ఎందుకు తప్పుదోవ పట్టించారో నిగ్గు తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Gautam Sawang
APPSC Scam
Andhra Pradesh Public Service Commission
Neelayapalem Vijay Kumar
PSR Anjaneeyulu
Comsign
APPSC Group 1 Exam
Corruption allegations
Haylands Resort
Uday Bhaskar

More Telugu News