India-Pakistan: హాట్‌లైన్ చర్చలు... సింధు జలాలపై మాట్లాడేందుకు పాక్‌కు అవకాశమివ్వని భారత్!

India Refuses to Discuss Indus Waters with Pakistan During Hotline Talks
  • భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల మధ్య చర్చలు
  • కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపైనే ప్రధానంగా సంప్రదింపులు
  • సింధు జలాల ఒప్పందంపై చర్చకు పాక్ ప్రయత్నం, అంగీకరించని భారత్
భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య హాట్ లైన్ చర్చలు ముగిశాయి. కాల్పుల విరమణ, సైనిక చర్యల నిలుపుదల ఒప్పందాన్ని కొనసాగించడంపై ఇరు దేశాల డీజీఎంఓలు ఈ సందర్భంగా చర్చించారని సమాచారం. అయితే, ఈ చర్చల్లో సింధు నదీ జలాల ఒప్పందం ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది.

చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం రద్దు అంశాన్ని లేవనెత్తాలని పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ, అందుకు అవకాశం లభించలేదని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ఉద్దేశించిన అవగాహనపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా భద్రతా పరమైన సంసిద్ధతపై దృష్టి సారించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నేడు ముంబైలోని తన అధికారిక నివాసం 'వర్ష'లో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసేందుకు ప్రధానిగా మోదీ వ్యక్తిగతంగా ఈ సమావేశంలో పాల్గొనాలని కూడా ఎంఏ బేబీ విజ్ఞప్తి చేశారు.
India-Pakistan
DGMO Talks
Sindhu Waters Treaty
Indo-Pak Relations
Ceasfire Agreement
Devendra Fadnavis
Maharashtra Security
MA Baby
Narendra Modi
Parliament Special Session

More Telugu News