Narendra Modi: పాక్ వేటిని చూసుకుని గర్వించిందో... భారత్ వాటిని దారుణంగా దెబ్బతీసింది: ప్రధాని మోదీ

Modis Strong Message on Indias Response to Pakistan
  • జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
  • భారత్ సత్తా ఏంటన్నది పాక్ కు అర్థమైందని వెల్లడి
  • భారత్ కొట్టిన దెబ్బకు పాక్ నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిందన్న ప్రధాని
  • కనీసం పాక్ యుద్ధవిమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితి కల్పించామని వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్-పాకిస్థాన్ వివాదం నేపథ్యంలో నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏంచేస్తుందన్నది బాగా అర్థమైందని అన్నారు. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటన్నది ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ చవిచూసిందని తెలిపారు. 

పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు మన సరిహద్దులు కూడా దాటలేదు

రెండున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్ గడ్డపై నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద ముఠాల అంతుచూసింది. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. మన సైన్యం దెబ్బకు పాక్ అచేతనావస్థకు చేరుకుంది. మన దాడులతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాక్ చివరికి భారత్ లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు మన సరిహద్దులు కూడా దాటలేదు. సరిహద్దులు దాటకుండానే వాటిని మన గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అంతేకాదు, పాక్ రక్షణ వ్యవస్థలను మన మిస్సైళ్లు ఛిన్నాభిన్నం చేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే క్షిపణులు, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. 

కాల్పుల విరమణకు పాక్ ప్రపంచ దేశాలను వేడుకుంది

ఉగ్రవాద శిబిరాలపై భారత క్షిపణులు, డ్రోన్లు కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాయి. సాంకేతిక యుద్ధంలో భారత్ ఆయుధ సంపత్తిని ప్రదర్శించడమే కాదు, పరిణతితో వ్యవహరించింది. మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో, ఎంత శక్తిమంతమైనవో భారత్ ప్రదర్శించింది. కనీసం పాక్ యుద్ధ  విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ కల్పించింది. పాక్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పింది. భారత్ దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్... కాల్పుల విరమణకు ప్రపంచం దేశాలను వేడుకుంది. పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంకోసారి పాక్ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చావుదెబ్బ కొట్టేందుకు భారత్  దళాలు సిద్ధంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్... ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టంగా చెప్పాయి. 

ఇక భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి

ఈ యుగం యుద్ధాలది కాదు, ఉగ్రవాదానిది అంతకంటే కాదు. కానీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకు భారత్ వెనుకాడదన్న స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా పంపించాం. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవరినీ భారత్ వదిలిపెట్టదు. పాకిస్థాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంత తానుగా నిర్మూలించాలి. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవు. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి. అణ్వాయుధాలను అడ్డుపెట్టుకుని ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తూ పాక్ చేసే బెదిరింపులను ఇక సహించేదిలేదు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ చూస్తూ ఊరుకోదు" అని మోదీ స్పష్టం చేశారు.
Narendra Modi
India-Pakistan Conflict
Operation Sundar
Surgical Strikes
Balakot Airstrikes
Terrorism
Pakistan
Drone Attacks
Missile Defense
India's Military Strength

More Telugu News