Jagga Reddy: రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య.. ఈటల రాజేందర్‌పై విరుచుకుపడిన జగ్గారెడ్డి

Jagga Reddy Slams Etala Rajender for Remarks Against Revanth Reddy
  • సీఎం రేవంత్‌పై ఈటల విమర్శలపై జగ్గారెడ్డి ఆగ్రహం
  • ఈటల వ్యాఖ్యలు అర్థరహితమన్న జగ్గారెడ్డి
  • తాను 19 ఏళ్లకే కౌన్సిలర్ నని, ఈటల తనకంటే జూనియర్ అని వ్యాఖ్య
  • కేసీఆర్ వల్లే ఈటల రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈటల వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. 'రండ' అనే పదానికి అర్థం ఏమిటో స్పష్టం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆ పదానికి అర్థం చెబితే, దానికి తగిన సమాధానం తాను ఇస్తానని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించినా, కాంగ్రెస్ పార్టీని విమర్శించినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పనికిమాలిన మాటకు స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తన రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ, తాను 19 ఏళ్లకే కౌన్సిలర్‌గా ఎన్నికైనప్పుడు ఈటల రాజేందర్ ఇంకా చదువుకుంటున్నారని పేర్కొన్నారు. "మీ వ్యక్తిత్వం ఎంత? మీకు మీరే ఎక్కువగా ఊహించుకోవద్దు. అంత అవసరం లేదు" అంటూ ఈటలకు హితవు పలికారు.

తాను మంచివారికి మంచివాడినని, రౌడీలకు రౌడీనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పార్టీ స్థాపించకపోయి ఉంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తే ఉండేవారు కాదని, ఎవరో పుణ్యమా అని ఆయన నాయకుడు అయ్యారని ఎద్దేవా చేశారు. "మీకే అంత ఉంటే, మాకు ఎంత ఉండాలి? మీరు ఒక్క తిట్టు తిడితే, మేము వంద తిడతాం. నియంత్రణలో ఉండి పరువు దక్కించుకోండి" అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రతో పోలిస్తే ఈటల వయసు చాలా తక్కువని, పార్టీకి మునిమనవడి లాంటి వారని అన్నారు. తన గురించి పూర్తిగా తెలియాలంటే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడులను అడగాలని సూచించారు.

ఈటల తనకంటే చాలా చిన్నవారని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌లో ఈటల పెద్ద సమస్యగా తయారయ్యారని, అందుకే కేసీఆర్ ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. తాను ఈటల మాదిరి 'హైబ్రిడ్' రకం కాదని, తాను 'నాటు' రకం అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Jagga Reddy
Etala Rajender
Revanth Reddy
BJP
Congress
Telangana Politics
Political Feud
Indian Politics
Telugu Politics

More Telugu News