Nadeendla Manohar: "ఇది నా ఊరు... ఇది నా బాధ్యత"... ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన మంత్రి నాదెండ్ల

Minister Nadeendla Manohar Directly Addresses Public Grievances
  • గుంటూరు జిల్లా కొల్లిపరలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
  • 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహణ
  • ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో అధికారులతో కలిసి 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల ఇబ్బందులపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. "ఇది నా ఊరు... ఇది నా బాధ్యత" అంటూ, ప్రజల నుంచి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మనోహర్ మొత్తం 213 అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తూ, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొల్లిపర మండలానికి చెందిన సిమ్లా నాయక్, దేవి బాయ్ దంపతులు తమకు కొత్త రేషన్ కార్డు (రైస్ కార్డు) మంజూరు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించి, వారికి ఏఏవై (AAY) కార్డు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, తక్షణ సాయంగా ఆ కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని అందజేశారు.

ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు కలిపి రైతుల ఖాతాల్లో రూ.12 వేల కోట్ల నగదు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

కొల్లిపర మండలంలో భూ సర్వేకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, వారం రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, గృహ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు వచ్చే నెలలోపే పొజిషన్ సర్టిఫికెట్లు (పీసీలు) జారీ చేస్తామని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో రైతుల సౌకర్యార్థం రూ.10 కోట్ల వ్యయంతో డొంక రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. కొల్లిపరలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని, పారిశుద్ధ్యం, రహదారుల ఆక్రమణల విషయంలో పౌరులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పదేళ్ల కిందట వేసిన రక్షిత మంచినీటి పైప్‌లైన్లకు మరమ్మతులు చేయించి, ఇంటింటికీ తాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ముఖ్యంగా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.

గతంలో తాను స్పీకర్‌గా పనిచేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను 18 రోజుల్లోనే పరిష్కరించిన సందర్భాలను, ఈ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వ్యవసాయ యంత్రాలు, ఇళ్ల పట్టాలు, గృహ రుణాలు, పింఛన్లు వంటివి అందించారని తెలిపారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వీకరించిన అర్జీలన్నింటినీ వారం రోజుల్లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Nadeendla Manohar
Andhra Pradesh Minister
Public Grievances
Kolipara Mandal
Tenali
Guntur District
Citizen Problems
Government Schemes
AAY Card
Rice Ration Card

More Telugu News