Trivikram Srinivas: ఆ రోజు నేను పొగడలేదు... కోప్పడ్డాను: త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram Srinivas on Sirivennela Seetharama Sastry I Was Angry Not Admiring
  • సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
  • ‘చిలకా ఏ తోడు లేక’ లాంటి పాటలను ఆయన చాలా అలవోకగా రాసేవారు: త్రివిక్రమ్
  • సినిమా పాట వల్ల ఆయన అక్కడే బందీ అయ్యారన్న త్రివిక్రమ్
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని గురించి కొంతకాలం క్రితం ఓ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న 'నా ఉచ్ఛ్వాసం కవచం' అనే కార్యక్రమంలో ఇదివరకే పలువురు ప్రముఖులు సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని పంచుకోగా, తాజా ఎపిసోడ్‌లో త్రివిక్రమ్ పలు విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిపై గతంలో తాను చేసిన ప్రసంగంపై స్పందిస్తూ.. ఆ రోజు తాను సిరివెన్నెలను పొగడలేదని, ఆయనపై కోప్పడ్డానని చెప్పారు. అలా ఎందుకు మాట్లాడారో త్రివిక్రమ్ వివరించారు.

చాలామంది ఆయన్ను (సీతారామశాస్త్రి) తాను ప్రశంసించానని అనుకున్నారని, కానీ పొగడలేదని త్రివిక్రమ్ అన్నారు. పొగడ్తలో కొంచెం డ్రామా, కొంచెం అతిశయోక్తి ఉంటాయన్నారు. తాను నిజమే మాట్లాడానని, అందుకే ఆ ప్రసంగం ఎక్కువమందికి నచ్చిందన్నారు. సినిమా స్థాయిని ఆయన పెంచారని పేర్కొన్నారు.

ఎంతో ప్రతిభ ఉన్నా సినిమా పాట వల్ల ఆయన అక్కడే బందీ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసినప్పుడు ఎన్నో అంశాల గురించి చర్చించుకునేవాళ్లమని అన్నారు. విషయం ఏదైనా ఆయన లోతుగా ఆలోచిస్తారని చెప్పారు. ఆయన వ్యాసాలు రాసేవారని చాలామందికి తెలియదన్నారు. ‘చిలకా ఏ తోడు లేక’ లాంటి పాటలను ఆయన చాలా అలవోకగా రాసేవారని అన్నారు.

ఆయన ఇంకా ఎంతో చేయగలిగిన వ్యక్తి అని, కానీ అప్పట్లో అవకాశాలు, తెలుగు సినిమా పరిధి తక్కువని అన్నారు. అందుకే ఆయన విషయంలో తనకు చాలా బాధ, కోపం ఉండేవని, దానినే ఆ రోజు చూపించానని త్రివిక్రమ్ వివరించారు. తాము బంధువులుగా ఎప్పుడూ భావించలేదని, ఆయన్ను సర్ అని సంబోధించేవాడినని, ఆయన శ్రీను అని పిలిచేవారని నాటి జ్ఞాపకాలను త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. 
Trivikram Srinivas
Sirivennela Seetharama Sastry
Telugu Cinema
Etv Na Uchhvasam Kavacham
Telugu Lyricist
Filmmaker
Tribute
Viral Speech
Telugu Film Industry

More Telugu News