Subbanna Ayappan: కావేరీ నదిలో శాస్త్రవేత్త అయ్యప్పన్ మృతదేహం

Death of Eminent Scientist Subbanna Ayappan
  • పద్మశ్రీ పురస్కార గ్రహీత, శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద మృతి
  • ఈ నెల 7న అదృశ్యం.. నది ఒడ్డున స్కూటర్ గుర్తింపు
  • భారతదేశ 'నీలి విప్లవ' రూపశిల్పిగా ప్రసిద్ధి
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన ఆయన శ్రీరంగపట్నం సమీపంలోని కావేరీ నదిలో శవమై తేలారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మైసూరులో తన భార్యతో కలిసి నివసిస్తున్న డాక్టర్ అయ్యప్పన్ ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో శనివారం (10న) శ్రీరంగపట్నంలోని సాయి ఆశ్రమం వద్ద కావేరీ నదిలో ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం సాయంత్రం ఆ మృతదేహాన్ని డాక్టర్ అయ్యప్పన్‌దిగా అధికారులు నిర్ధారించారు. ఆయన ఉపయోగించిన స్కూటర్ కూడా నది ఒడ్డున గుర్తించారు. శ్రీరంగపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ ఎవరు? 
భారతదేశంలో 'నీలి విప్లవం' (ఆక్వాకల్చర్) ప్రధాన రూపకర్తలలో ఒకరిగా డాక్టర్ అయ్యప్పన్‌కు విశేష గుర్తింపు ఉంది. చేపల పెంపకంలో నూతన, మెరుగైన పద్ధతులను ఆయన ఆవిష్కరించారు. ఇది దేశ వ్యాప్తంగా చేపల పెంపకం, ఉత్పత్తి విధానాలను సమూలంగా మార్చివేసింది. ఆయన కృషి గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా ఆహార వ్యవస్థలను బలోపేతం చేసింది. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లో ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఆక్వాకల్చర్, సుస్థిర వ్యవసాయ రంగంలో దశాబ్దాల పాటు సాగిన డాక్టర్ అయ్యప్పన్ కెరీర్‌లో అనేక కీలక పదవులు అలంకరించారు. భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్ (సీఐఎఫ్ఏ), ముంబైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్ఈ)లకు డైరెక్టర్‌గా సేవలందించారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎఫ్‌డీబీ) వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు. భారత ప్రభుత్వంలోని వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్ఈ) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

పదవీ విరమణ అనంతరం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) చైర్‌పర్సన్‌గా, ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీఏయూ) వైస్-ఛాన్సలర్‌గా కూడా ఆయన సేవలందించారు. డాక్టర్ అయ్యప్పన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Subbanna Ayappan
Indian Council of Agricultural Research
ICAR
Padma Shri Awardee
Agricultural Scientist
Aquaculture
Fisheries
Kaveri River
Mysore
Srirangapatna

More Telugu News