IPL 2025: 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్‌కు నిరాశ!

IPL 2025 Resumes on May 17th Disappointment for Telugu Fans
  • మే 17 నుంచి 6 వేదికలలో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించాలని నిర్ణ‌యించిన‌ బీసీసీఐ
  • సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ 
  • 17 నుంచి 27 వ‌ర‌కు మిగిలిన లీగ్ మ్యాచులు
  • ఇందులో ఒక్క‌టి కూడా ఉప్ప‌ల్‌, విశాఖ స్టేడియాల్లో నిర్వ‌హించ‌ని వైనం
  • దీంతో తెలుగు రాష్ట్రాల అభిమానుల‌కు నిరాశ‌
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ను మే 17 నుంచి ఆరు వేదికలలో తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ జరగనుంది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఒకింత సద్దుమణగ‌డంతో బీసీసీఐ నిన్న‌ అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్‌ తదుపరి షెడ్యూల్‌ను ఖరారు చేసిన విష‌యం తెలిసిందే.

మిగిలిన 17 మ్యాచ్‌ల కోసం దేశంలో ఆరు వేదికలను ఖరారు చేసింది. ఇందులో జైపూర్‌, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్‌, ఢిల్లీ ఉన్నాయి. ఈ లీగ్ మ్యాచుల్లో ఒక్క‌టి కూడా ఉప్ప‌ల్‌, విశాఖ స్టేడియాల్లో నిర్వ‌హించ‌క‌పోవ‌డం తెలుగు రాష్ట్రాల అభిమానుల‌కు నిరాశ క‌లిగించే విష‌యం విష‌యం. 

పాక్‌తో ఉద్రిక్త‌తల న‌డుమ ద‌క్షిణాది రాష్ట్రాల‌కే బీసీసీఐ మొగ్గు చూపుతుంద‌ని భావించినా బెంగ‌ళూరు త‌ప్ప మిగ‌తా వేదిక‌ల‌కు చోటు క‌ల్పించ‌లేదు. మ‌రి ప్లేఆఫ్స్‌, ఫైన‌ల్ మ్యాచుల‌కైనా చోటు క‌ల్పిస్తారేమో చూడాలి. ఇక‌, ఈనెల 17న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) మధ్య బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ సందడి మళ్లీ మొదలు కానుంది.

ఈ క్రమంలో రెండు ఆదివారాలు లీగ్‌లో డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఉండ‌నున్నాయి. లీగ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ... మే 29 నుంచి క్వాలిఫయర్‌-1తో ప్లేఆఫ్స్ ప్రారంభమ‌వుతాయి. మే 30న ఎలిమినేటర్‌, జూన్‌ 2న క్వాలిఫయర్‌-2, జూన్‌ 3న ఫైనల్‌ జరుగనున్నాయి. అయితే, ప్లేఆఫ్స్ వేదికలను మాత్రం ఇంకా బీసీసీఐ ఖరారు చేయలేదు. 

"టాటా ఐపీఎల్ 2025 పునఃప్రారంభాన్ని ప్రకటించడానికి బీసీసీఐ సంతోషంగా ఉంది. ప్రభుత్వం, భద్రతా సంస్థలు, అన్ని కీలక వాటాదారులతో విస్తృతమైన చ‌ర్చ‌ల‌ తర్వాత బోర్డు మిగిలిన సీజన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది" అని క్రికెట్‌ బోర్డు త‌న‌ ప్రకటనలో పేర్కొంది.

ఇదిలాఉంటే... భారత్‌, పాక్‌ పరిస్థితులు అదుపులోకి వచ్చిన వేళ లీగ్‌లో విదేశీ ప్లేయర్ల ప్రాతినిధ్యంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు ప్లేయర్ల తమ దేశాలకు పయనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్రాంచైజీలు వారిని తిరిగి భార‌త్‌కు ర‌ప్పించ‌డం అంత సులువు కాదు అనేది విశ్లేష‌కుల అభిప్రాయం. 

                                               ఐపీఎల్ 2025 సవరించిన పూర్తి షెడ్యూల్ ఇదే..
IPL 2025
BCCI
IPL Resumption
IPL Schedule
Cricket
India
Pakistan
Hyderabad
Visakhapatnam
IPL Venues
Royal Challengers Bangalore
Kolkata Knight Riders

More Telugu News