EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఇంటర్నెట్ లేకున్నా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు!

Check PF Balance Without Internet EPFOs New Offline Services
  • పీఎఫ్ వివరాలకు ఈపీఎఫ్ఓ కొత్త సేవలు
  • నెట్ లేకున్నా పీఎఫ్ వివరాలు మీ చేతిలోనే!
  • ఇంటర్నెట్ అవసరం లేని ఉచిత సదుపాయం
  • యూఏఎన్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి
  • తెలుగుతో పాటు పలు భాషల్లో ఎస్ఎంఎస్ సౌకర్యం
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాదారులు తమ ఖాతాలోని బ్యాలెన్స్, ఇతర వివరాలను తెలుసుకోవడానికి ఇకపై ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా లేదా పోర్టల్‌లో లాగిన్ అయ్యే అవసరం లేకుండానే పీఎఫ్ సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) రెండు సరికొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ ద్వారా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా డిజిటల్ వేదికలు అందుబాటులో లేని సభ్యులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. యాక్టివ్‌గా ఉన్న యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటే చాలు, ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

 
వేగంగా.. ఖర్చు లేకుండా..
యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న ఈపీఎఫ్‌వో సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ వివరాలను తక్షణమే పొందవచ్చు. దీనికోసం బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్, పాన్ కార్డు వంటివి యూఏఎన్‌తో అనుసంధానమై ఉండాలి. ఈ నంబర్‌కు కాల్ చేసిన వెంటనే రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. అనంతరం మీ పీఎఫ్ బ్యాలెన్స్, చివరిగా జమ అయిన మొత్తం వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ మీ మొబైల్‌కు వస్తుంది. ఈ సేవ పూర్తిగా ఉచితమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సదుపాయం లేనివారి సౌలభ్యం కోసం ఈ సేవను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి
ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పొందాలనుకునే వారి కోసం కూడా ఈపీఎఫ్‌వో ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. ఈ సేవ ద్వారా పలు భారతీయ భాషలలో పీఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 77382 99899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. సమాచారం డిఫాల్ట్‌గా ఆంగ్లంలో వస్తుంది. ఒకవేళ తెలుగులో కావాలంటే, EPFOHO UAN TEL అని పంపాలి. ఇదే విధంగా హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) భాషల్లో కూడా సమాచారం పొందవచ్చు. ఈ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి కాంట్రిబ్యూషన్‌తో పాటు ఖాతాకు అనుసంధానమైన కేవైసీ వివరాలు కూడా తెలుస్తాయని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

 ఈ సేవల ప్రాముఖ్యం
ఈ సరికొత్త ఆఫ్‌లైన్ సేవల ద్వారా స్మార్ట్‌ఫోన్లు లేదా ఇంటర్నెట్ సదుపాయం లేనివారు కూడా తమ పదవీ విరమణ పొదుపు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇది కోట్లాది మంది వేతన జీవులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి పీఎఫ్ వివరాలపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 యూఏఎన్ యాక్టివేషన్ సులభం 
ఒకవేళ మీ యూఏఎన్ ఇంకా యాక్టివేట్ కాకపోతే, https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface వెబ్‌సైట్‌ను సందర్శించి హోమ్ పేజీలోని "Activate UAN" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. పాస్‌వర్డ్ సెట్ చేసుకుని లాగిన్ అవ్వొచ్చు. యాక్టివేషన్ పూర్తయిన వెంటనే ఈపీఎఫ్ఓ మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

 కేవైసీ వివరాల అప్‌డేట్ 
ఈపీఎఫ్‌వో సేవలను పూర్తిగా పొందాలంటే కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అయి, ‘Manage’ సెక్షన్‌లోని ‘KYC’ ఆప్షన్‌కు వెళ్లి ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వంటి వివరాలను అప్‌డేట్ చేసి ‘Save’ చేయాలి. అనంతరం, మీ యాజమాన్యం ఈ అప్‌డేట్‌లను ఆమోదిస్తుంది.
EPFO
PF Balance
UAN
Missed Call Balance Check
SMS Balance Check
EPF
Employee Provident Fund
Online PF Services
Offline PF Services
KYC Update

More Telugu News