Himanta Biswa Sarma: అందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం: హిమంత బిశ్వ శర్మ

Himanta Biswa Sarma on Operation Sindhu and 1971 War
  • పాక్‌తో కాల్పుల విరమణపై మోదీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్న సీఎం
  • 1971 యుద్ధంలో గెలిచినా పీఓకేను, సిలిగుడి కారిడార్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శ
  • అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ వ్యూహాత్మక ప్రాంతాలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
  • 'ఆపరేషన్ సింధూర్' లక్ష్యాలు నెరవేరాయి, అందుకే కాల్పుల విరమణ అని వెల్లడి
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించేందుకే 'ఆపరేషన్ సిందూర్' చేపట్టినట్లు వెల్లడించారు.

1971 నాటి ఇండో-పాక్ యుద్ధంలో భారత్ చారిత్రక విజయం సాధించినప్పటికీ, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడంలోనూ, కీలకమైన సిలిగుడి కారిడార్ ('చికెన్ నెక్ ఆఫ్ ఇండియా')ను విస్తరించడంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ఆయన నిలదీశారు. గౌహతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు.

1971 యుద్ధానంతర పరిస్థితులను ప్రస్తావిస్తూ, "ఆనాడు భారత సైన్యం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పీవోకేను మన దేశంలో విలీనం చేయడానికి, అలాగే ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగుడి కారిడార్‌ను కనీసం 100 మైళ్ల మేరకైనా విస్తరించుకోవడానికి అదే సరైన తరుణం. కానీ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని హిమంత ప్రశ్నించారు.

ఒకవేళ ఇందిరాగాంధీ జీవించి ఉంటే, నేరుగా ఆమెనే ఈ ప్రశ్నలు అడిగేవాడినని ఆయన అన్నారు. వివిధ దేశాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ కీలక ప్రాంతాలను ఆనాడే భారత్ తన అదుపులోకి తీసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ సిందూర్ అందుకే..

ఇటీవల పాకిస్థాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా హిమంత స్పందించారు. "పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మూలాలను సమూలంగా పెకిలించడానికి 'ఆపరేషన్ సింధూర్' చెపట్టాం. నిర్దేశించుకున్న లక్ష్యాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అందుకే, పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది" అని ఆయన వివరించారు. ఉగ్రవాదులకు మద్దతునిచ్చిన పాకిస్థాన్ సైన్యానికి కూడా భారత బలగాలు తగిన రీతిలో సమాధానం చెప్పాయని ఆయన పేర్కొన్నారు. భారత సైనిక శక్తి ముందు నిలవలేమని గ్రహించిన పాకిస్థాన్, చివరికి కాళ్లబేరానికి వచ్చిందని అన్నారు.
Himanta Biswa Sarma
Operation Sindhu
India-Pakistan
1971 Indo-Pak War
POK
Siliguri Corridor
Pakistan Terrorism
Indira Gandhi
Ceasfire Agreement
Assam Chief Minister

More Telugu News