Ponguru Narayana: అమరావతి భూసేకరణపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayanas Key Remarks on Amaravati Land Acquisition
  • రాజధాని అమరావతికి మరో పది వేల ఎకరాలు అవసరమన్న మంత్రి పొంగూరు నారాయణ
  • కాలుష్యం లేని పరిశ్రమల కోసం 2,500ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500, అంతర్జాతీయ విమానాశ్రయానికి 5వేల ఎకరాలు కావాలని వెల్లడి
  • అధికారుల కోసం ఏడాదిలో 4వేల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నారాయణ
అమరావతిలో భూసేకరణపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి మరో పది వేల ఎకరాల భూమి అవసరమని ఆయన తెలిపారు. మంగళవారం క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతిలో అధికారుల కోసం 4 వేల ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు అంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు.

అమరావతికి మొత్తంగా మరో పదివేల ఎకరాలు కావాలని అన్నారు. అమరావతిలో కాలుష్యం లేని పరిశ్రమల కోసం 2,500 ఎకరాలు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500, అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కావాలని తెలిపారు.

ల్యాండ్ పూలింగ్ అయితే రైతులకు నష్టం ఉండదని ప్రజాప్రతినిధులు సూచించారన్నారు. క్రెడాయ్ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వల్ల అనుబంధ రంగాల్లో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఏడాదిన్నరలో రాజధాని రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. ఐకానిక్ భవనాలు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. 
Ponguru Narayana
Amaravati Land Acquisition
Andhra Pradesh Capital
Real Estate Andhra Pradesh
Land Pooling Amaravati
International Airport Amaravati
Credai AP
Minister Narayana

More Telugu News